పిఠాపురం ఖాయం చేసిన పవన్... అక్కడ లెక్కలివే!

ఇక ఈ నియోజకవర్గంలో 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచారు వంగా గీతా విశ్వనాథ్. అనంతరం ఆమె వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

Update: 2024-03-14 10:21 GMT

చాలాకాలం సస్పెన్స్ తర్వాత, చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత.. ఆ సస్పెన్స్ కు, ఎదురుచూపులకు తెరదించుతూ... తాను పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్... ఈ విషయాని వెల్లడించారు. తాను పోటీ చేయడానికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఖాయం చేసుకున్నట్లు తెలిపారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇప్పటికే ఉన్న 21 స్థానాల్లోనూ 15 నియోజకవర్గాలకు అభ్యర్థులు కన్ ఫాం అయిన సమయంలో.. భీమవరాన్ని కూడా మాజీ టీడీపీ నేతకు అప్పగించిన నేపథ్యంలో.. పవన్ పోటీ ఎక్కడ నుంచి అనే ప్రశ్న ఏపీ రాజకీయవర్గాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని.. అందుకోసం కాకినాడ ఎంచుకున్నారనీ కథనాలొచ్చాయి. అయితే తాజాగా పవన్.. పిఠాపురాన్ని ఖాయం చేశారు.

ఇక పిఠాపురం విషయనికొస్తే... ఇక్కడ కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు! ఈ క్రమంలో ఒక నాలుగు ఎలక్షన్స్ వెనక్కి వెళ్తే... 2004లో పెండెం దొరబాబు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా... 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

ఇక ఆయన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వినిపించే పేరు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ! 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. 2019లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈయనకు టిక్కెట్ దక్కదనే సంకేతాలు ఉండటంతో... స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలనే ప్రచారం బలంగా మొదలైంది!

Read more!

ఇక ఈ నియోజకవర్గంలో 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచారు వంగా గీతా విశ్వనాథ్. అనంతరం ఆమె వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆమెకు పిఠాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇక ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తే వైసీపీ మరో ట్రంప్ కార్డ్ ని రంగంలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే... ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ!

ముద్రగడ పద్మనాభం అన్నీ అనుకూలంగా జరిగితే రేపు వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినా... ఆయన కుమారుడికి పిఠాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగినా.. లేక, వంగ గీతతో కలిసి వైసీపీ తరుపున ముద్రగడ ప్రచారం చేసినా... పిఠాపురంలో రసవత్తర రాజకీయం తెరపైకి వచ్చేసినట్లే అని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News