టీడీపీకి మూడంచల మేళ్లు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా..!
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమదే విజయమని భావిస్తున్న వైసీపీ.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.;
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమదే విజయమని భావిస్తున్న వైసీపీ.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తదుపరి తమదే ప్రభుత్వమని ఆశలు ఉండొచ్చు. అంచనాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ .. గత ఎన్నికలకు ముందున్న పరిస్థితుల కన్నా.. ఇప్పుడు టీడీపీ పుంజుకోవడంతో పాటు.. ప్రజలకు అందిస్తున్న సంక్షేమం వంటివి కూడా కలిసి వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ చెబుతున్నట్టుగా.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. టీడీపీకి మూడంచల్లో మేళ్లు కనిపిస్తున్నాయి. ఈ విషయంలోనే వైసీపీ పునరాలోచన చేసుకోవాలి.
1) సంక్షేమం: కూటమి ప్రభుత్వంపై గతంలో వైసీపీ చేసిన విమర్శలు ఇప్పుడు తుడిచి పెట్టుకుని పోతు న్నాయి. చంద్రబాబు వస్తే.. సంక్షేమం ఆగిపోతుందని.. ఆయన పేదలను పట్టించుకోరని చెప్పారు. అంతే కాదు.. మేనిఫెస్టోను కూడా మరిచిపోతారని జగన్ వ్యాఖ్యానించారు. కానీ, దీనికి విరుద్ధంగా అసలు పేదల ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పీ-4ను భుజానికి ఎత్తుకున్నారు. దీనిని సాకారంచేయడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకురానున్నారు. ఇక, ఇతర పథకాలను కూడా అమలు చేస్తున్నారు. సో.. దీంతో టీడీపీపై ఉన్న వైసీపీ ముద్ర తుడిచేయనున్నారు.
2) బలమైన పవన్ ఇమేజ్: వైసీపీలో లేనిది.. టీడీపీకి ఉన్నది కూడా పవన్ ఇమేజ్. గత ఎన్నికల్లో వైసీపీ ని నిలువునా దెబ్బ తీసింది. అంతేకాదు.. పవన్ వెంట యువత ఎక్కువగా ఉండడం కలిసి వస్తున్న పరి ణామం. కాపు ఓటు బ్యాంకు ఎలానూ సుస్థిరంగా ఉంది. ఇది కూటమికి మరోసారి ఉపయోగపడనుంది. అంతేకాదు.. మరోసారి ఎన్నికలు జరిగినా.. మూడు పార్టీలు కూటమిగానే ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఇది కూడా టీడీపీకి కలిసి వచ్చే పరిణామం. ఈ విషయంలోనూ వైసీపీ పునరాలోచన చేసుకోవాల్సి ఉంది.
3) ఎన్నారైలు, అభివృద్ధి: ఎన్నారైలు.. గతంలోనూ ఇప్పుడు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. కూ టమిని గత ఎన్నికలకు ముందు పరుగులు పెట్టించిన వర్గంలో ఎన్నారైలది ప్రత్యేక పాత్ర అనే చెప్పాలి. ఇక, ఇప్పుడు కూడా వారి పాత్ర అలానే ఉంది. పైగా చంద్రబాబు అమరావతిని డెవలప్ చేయడంతోపాటు పెట్టుబడులుకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో మరింత మంది ఎన్నారైలు.. టీడీపీకి సానుకూలంగా మారుతున్నారు. ఈ తరహా పరిస్థితి వైసీపీకి లేదు. ఇక, అభివృద్ధి పరంగా కూడా.. కూటమి సర్కారు పరుగులు పెడుతోంది. ఉద్యోగాలు, ఉపాధికల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఈ మూడు అంశాల ప్రాతిపదికన..కూటమి చెలరేగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.