పవన్ వర్సెస్ విజయ్ : 2029 లో దక్షిణ భారతం షేక్ !

దక్షిణ భారతదేశంలో అపరిమితమైన సినీ గ్లామర్ కలిగిన ఇద్దరు టాప్ హీరోలు ఇప్పుడు రెండు భిన్న రాజకీయ వేదికల మీద ఎదురు బొదురు కానున్నారు.;

Update: 2026-05-11 17:21 GMT

దక్షిణ భారతదేశంలో అపరిమితమైన సినీ గ్లామర్ కలిగిన ఇద్దరు టాప్ హీరోలు ఇప్పుడు రెండు భిన్న రాజకీయ వేదికల మీద ఎదురు బొదురు కానున్నారు. వీరిద్దరి రాజకీయ సమరానికి 2029 లోక్ సభ ఎన్నికలు వేదికగా మారుతాయా అన్న చర్చ సాగుతోంది. విషయానికి వస్తే కాంగ్రెస్ కి సినిమా గ్లామర్ గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఉండేది. ఎంతోమంది దక్షిణాది నటులు కాంగ్రెస్ వైపు ఉండేవారు. అయితే గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ వైపు వెళ్ళే వారు అయితే ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. కానీ ఆయాచిత వరంగా తమిళనాడు దళపతి సూపర్ స్టార్ విజయ్ కాంగ్రెస్ మొగ్గు చూపారు. దాంతో కాంగ్రెస్ కి సినీ గ్లామర్ పుష్కలంగా దక్కుతోంది. అలా హస్తం పార్టీ కి మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. సినీ గ్లామర్ నిండుగా మెండుగా ఉన్న విజయ్ తో కేవలం తమిళనాడు అవసరాలే కాదు దక్షిణ భారతంలో రాజకీయ పరిస్థితులను పూర్తిస్థాయిలో అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్ నే గీస్తోంది.

రాహుల్ విత్ విజయ్ :

ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరలి రావడం భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడమే అని అంటున్నారు. టీవీకే అధినేత కొత్త సీఎం విజయ్ కూడా రాహుల్ ని తన అన్నగా సంబోధిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. దాంతో విజయ్ రాహుల్ సూపర్ కాంబోతో దక్షిణాదిన కాంగ్రెస్ కి మరిన్ని మంచి రోజులను తెస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ కు ఇప్పటికే మంచి పట్టు ఉంది. ఉత్తరాదిన బిజెపి ఎంత ప్రభంజనం సృష్టించినా దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్పందన లభించడం లేదు. ఇప్పుడు చూస్తే దక్షిణ భారతం రాజకీయ మ్యాపులో అంత కాంగ్రెస్ మయమే అయినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణ కేరళలో ఉంది. తమిళనాడులో కూడా ఇప్పుడు విజయ్ పార్టీలో చేరి ప్రభుత్వంలో భాగం అవుతోంది

పవన్ ఆశాకిరణం :

ఇక ఏపీ ఒక్కటే ఎన్డీఏ కి ఆశాకిరణంగా ఉంది. దాంతో నరేంద్ర మోడీ సినీ గ్లామర్ ని సినీ గ్లామర్ తోనే దక్షిణాదిన ఢీ కొట్టాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పవర్ స్టార్ గా పవర్ ఫుల్ ఇమేజ్ తో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్లి భేటీ కావడం సరికొత్త రాజకీయ విశ్లేషణలకు తావిస్తోంది. ఒకవైపు విజయ్ తన సినీ గ్లామర్ కు రాజకీయ గ్రామర్ ని జోడించి తమిళనాడులో సూపర్ హిట్ కొట్టారు. ఏకంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన అండతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తన రాజకీయ జాతకాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర మీద సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఆయనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలో కాషాయం రెపరెపలను చూడాలని బిజెపి పెద్దలు ఆశపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి సహిత ఎన్డీఏ ప్రభుత్వాలను రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలని, అలాగే కర్ణాటకలో విజయం సాధించడంతోపాటు తమిళనాడులో విజయ్ సినీ గ్లామర్ అడ్డుకొని పవన్ ద్వారా బీజేపీ కొత్త రాజకీయానికి తెర తీయాలని చూస్తోంది. వీలైతే కేరళలో కూడా పవన్ ఇమేజ్ ని వాడుకోవాలని భావిస్తోంది.

సౌత్ లో స్టార్ వార్ :

దాంతో అటు విజయ్ ఇటు పవన్ ఈ ఇద్దరి మధ్యనే 2029 లో రాజకీయం ఢీ అంటే ఢీ కొట్టిన ఉండే పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ తనదైన సరికొత్త భావజాలాన్ని దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బిజెపి హిందుత్వ సనాతన వాదాన్ని ఇప్పటికే బలంగా నమ్ముతూ జనంలోకి తీసుకెళ్తున్నారు. దాంతో విజయ్ సిద్ధాంతం నెగ్గుతుందా పవన్ సనాతనం జనాల్ని ఆకట్టుకుంటుందా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ విజయ్ ఇద్దరూ వెండి తెర మీద తిరుగులేని సూపర్ స్టార్లు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్య సినీ రాజకీయ ఇమేజ్ ఏ స్థాయిలో ఢీ కొడుతుందో రానున్న లోక్ సభ ఎన్నికలే రుజువు చేయనున్నాయి ఈ ఇద్దరి వెనక మోడీ వర్సెస్ రాహుల్ రాజకీయ చాణక్యం కూడా మిక్స్ అయితే పవర్ ఫుల్ పొలిటికల్ మూవీనే వచ్చే ఎన్నికల్లో అంతా చూడొచ్చు అన్న మాట.

Tags:    

Similar News