రిజల్ట్ డే @ 2024 - పవన్ ఏం చేశారు? రెండేళ్ల క్రితం నాటి ఫోటో స్టోరీ

జూన్ 4, ఈ తేదీకి తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ ఏడాది జూన్ 4న విడుదలయ్యాయి.

Update: 2026-06-04 11:51 GMT

జూన్ 4, ఈ తేదీకి తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ ఏడాది జూన్ 4న విడుదలయ్యాయి. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చేసిన ప్రతిజ్ఞతో కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పవన్.. ఫలితాల రోజున ఎలా ఉన్నారో తెలియజేసే ఆ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.

హడావిడికి భిన్నంగా!

సాధారణంగా ఎన్నికల ఫలితాల రోజున ఏ రాజకీయ నాయకుడైనా తీవ్ర ఉత్కంఠకు లోనవుతుంటారు. గెలుపోటములపై అంచనాలు, ట్రెండ్స్ చూస్తూ క్షణం కూడా కాలు నిలపకుండా హడావుడి పడుతుంటారు. పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ, ఫలితాల సరళిని తెలుసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇక విజయం సాధిస్తున్న పక్షం ఎప్పుడు సంబరాలు చేసుకోవాలనే విషయంపైనా ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ, నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచినా ఆ హడావుడికి దూరంగానే ఉన్నారు. కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించి, ప్రత్యర్థి 11 సీట్లకు పరిమితమైనా జనసేనాని సంబరాలు చేసుకోకుండా.. మౌనంగానే ఫలితాలను గమనిస్తూ గడిపేశారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు జనసేన పేజీల్లో హల్ చల్ చేస్తోంది.

ఫలితాలు వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన అఫీషియల్ గా తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక ట్వీట్లు చేసింది. ‘‘నెత్తిమీద కాలు వేసి తొక్కడం పూర్తయి రెండేళ్లు అయింది’’ అంటూ ఒక పోస్టు పెట్టింది. అదేసమయంలో ధైర్యానికి రెండేళ్లు అంటూ పవన్ వీడియోను పోస్టు చేసింది. ఇదే సమయంలో సాదాసీదాగా లాల్చీ, పంచెకట్టుతో తన నివాసంలోని సోఫాలో ప్రశాంతంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటో రెండేళ్ల క్రితం ఎన్నికల రోజు పవన్ నివాసంలో తీసినదిగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా, ఫలితాలను వీక్షిస్తున్నట్లు ఆ ఫొటో వెల్లడిస్తోంది.

దీంతో పవన్ వైఖరిపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి విజయం సాధిస్తుందని సర్వేలు చెప్పిన జోస్యాలు నిజమవుతాయా అనే టెన్షన్ ఆయనలో అస్సలు కనిపించలేదని అంటున్నారు. మరోవైపు ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే నమ్మకం ఆయనలో బలంగా కనిపించిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక జనసైనికులు అయితే ‘ఎలాగూ గెలుస్తున్నాం.. గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి? రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి ఎలా తీసుకెళ్లాలి? ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ అనే దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ ఫొటో చూసిన పరిశీలకులు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణం అందరికీ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. రసవత్తరంగా సాగిన ఎన్నికల యుద్ధంలో ఫలితాలు వెలువడే అత్యంత కీలకమైన సమయంలో కూడా ఎలాంటి చలనం లేకుండా, ఒక యోగిలా అంత నిశ్శబ్దంగా కూర్చోవడం కేవలం పవన్ కల్యాణ్ లాంటి నాయకుడికే సాధ్యమని కొనియాడుతున్నారు. మొత్తానికి పవన్ ఫొటో సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు తెరలేపిందని వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News