లిక్కర్ స్కాం : పవన్ ఒక్కరే సేఫ్!

ఏపీ లిక్కర్ స్కాం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైసీపీ ముఖ్య నేతలు ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఇప్పటికే జైలుకు వెళ్లారు.;

Update: 2025-08-07 13:30 GMT

ఏపీ లిక్కర్ స్కాం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైసీపీ ముఖ్య నేతలు ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఇప్పటికే జైలుకు వెళ్లారు. అయితే స్కాంలో కీలక నిందితుడుగా చెబుతున్న ఏ34 వెంకటేశ్ నాయుడు పాత్ర ఇటీవల సంచలనంగా మారింది. ఆయన ఫోన్ నుంచి సిట్ వెలికి తీసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు అందరితోనూ ఆయన ఫొటోలు బయటకు రావడంతో లిక్కర్ స్కాంలో పాత్రధారులు అంటూ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో వెంకటేశ్ నాయుడు ఫొటోలు దిగడంతో వైసీపీ అటాక్ ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కాం జరిగిందని ఆరోపిస్తోంది.

అయితే వైసీపీ ఆరోపణల్లో పస లేకపోయినప్పటికీ వెంకటేశ్ నాయుడు ఫొటోలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నేతలు అందరినీ ఉలికిపాటుకు గురిచేశాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. వెంకటేశ్ నాయుడు వంటివారితో ఫొటోలు దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన మంత్రివర్గ సహచరులకు సూచించారు. వెంకటేశ్ నాయుడు ఎవరో ఎలాంటి వాడో ముందుగా చంద్రబాబుకు తెలియక పోయినప్పటికీ, నిందితుడు తనతో దిగిన ఫోటోను చూసి చంద్రబాబు షాక్ తిన్నారని అంటున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేశ్ తోపాటు ఇతర టీడీపీ నేతలతోనూ వెంకటేశ్ నాయుడు ఫొటోలు దిగారు. అదే సమయంలో తెలంగాణలో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు బయటపడింది.

డబ్బు కట్టలు లెక్కపెడుతున్న వెంకటేశ్ నాయుడు వీడియో వైరల్ అయిన తర్వాత చాలా ఫొటోలు బయటకు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో ముఖ్యలు అందరితోనూ ఆయన ఫొటోలు ఉండటంతో ఆయన ఎవరికి సన్నిహితుడు? ఏం చేస్తుంటాడు అన్న చర్చ మొదలైంది. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే వెంకటేశ్ నాయుడు నుంచి సేఫ్ గా తప్పించుకున్నారని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రముఖులు అందరితోనూ వెంకటేశ్ నాయుడు ఫొటోలు బయటపడ్డాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పుడో ఒకసారి వారు కలవడం జరిగింది. సందర్భం ఏదైనా నాటి ఫొటోలు ఇప్పుడు రచ్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు.

కానీ, డిప్యూటీ సీఎం పవన్ మాత్రం ఈ ఎపిసోడ్ లో సేఫ్ గా ఉండటమే ఆసక్తికరంగా మారింది. దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న పవన్ వద్దకు ఒకసారి కూడా వెంకటేశ్ నాయుడు వెళ్లలేదా? లేక పవన్ మాత్రమే ఆయన ఎవరో తెలుసుకుని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రి వంటి స్థాయి ఉన్న నేతల వద్దకు చాలా మంది వచ్చి కలుస్తుంటారు.. లిక్కర్ స్కాంలో నిందితుడు అయిన వెంకటేశ్ నాయుడు సైతం తన ప్రయోజనాల కోసం నేతలు అందరిని కలిసినట్లు చెబుతున్నారు. అయితే ఆయన పవన్ ను కలుసుకోకపోవడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పవన్ ను కూడా వెంకటేశ్ నాయుడు కలిసి ఉంటే వైసీపీ మరింతగా అస్త్రాలు సంధించేది. అదే సమయంలో తమ పార్టీతో అతడి సంబంధం లేదని ఇంకా బలంగా చెప్పగలిగేది. కానీ, పవన్ ఈ విషయంలో విపక్షానికి ఆ అవకాశం ఇవ్వలేదని అంటున్నారు.

Tags:    

Similar News