పవన్ స్ట్రాటజీ ఫలించేనా.. కీలక నిర్ణయం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన, పార్టీ నాయకుల పైన చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టేలా భవిష్యత్తులో ప్రభుత్వంతో మాట్లాడి కొత్త చట్టం తీసుకువచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, వాస్తవానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది.. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉందా? అనేది ఆసక్తిగా మారింది.
ఇలా చూస్తే సాధ్యం కాదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాను భావ ప్రకటన స్వేచ్ఛకు పర్యాయంగా మార్చాయి. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు సోషల్ మీడియాని వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితో కేంద్ర హోమ్ శాఖ కూడా కొన్నాళ్ల కిందట రాష్ట్రాలకు సోషల్ మీడియా పై నమోదు అయిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని బట్టి సోషల్ మీడియా అనేది ప్రజలకు ఉన్న ప్రధాన స్వేచ్ఛగా అటు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నాయి.
దీనిపై ఇప్పటికే ఐటి చట్టం కూడా ఉంది. దీని ప్రకారం వివాదాస్పద కంటెంట్, దేశద్రోహానికి సంబంధించిన విషయాలు, శత్రు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నిషేధించేలాగా రూపొందించారు. చట్టంలో కొన్ని మార్పులు కూడా చేశారు. అంతే తప్ప వ్యక్తిగత విషయాలు లేదా రాజకీయపరమైన అంశాలను నిషేధించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఆ నిబంధనను సదరు చట్టం నుంచి తీసేశారు. ఈ విషయం మరి తెలిసి కూడా జనసేనని కొత్త చట్టం చేస్తానని చెబుతున్నారా లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేకంగా అమలు చేయాలని భావిస్తున్నారా అనేది చూడాలి.
సోషల్ మీడియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై రాష్ట్రాలు చట్టాలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆలోచన ఏ మేరకు సక్సెస్ అవుతుంది. ఆయన అనుకున్నట్టుగా సోషల్ మీడియాకు సంకెళ్లు వేసే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటికి ఇప్పుడైతే దీనికి అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకులు మేధావులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.