ఉప ముఖ్యమంత్రి...అక్కడ నుంచే డ్యూటీలోకి

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదు అని అంటున్నారు.

Update: 2026-07-21 04:19 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదు అని అంటున్నారు. ఆయనకు గత వారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన ఇంకా విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచిస్తున్నా కూడా ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నెరవేర్చేందుకే నిర్ణయించుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణకు సిద్ధపడుతున్నారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.

క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరం :

ఇదిలా ఉంటే డాక్టర్లు ఇచ్చిన సలహా సూచనలతో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పర్యటనలకు మాత్రం ఇంకా దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఆయన కనీసంగా రెండు వారాల పాటు అయినా బయట పర్యటనలు పెట్టుకోరని అంటున్నరు. అదే సమయంలో తన అధికారిక విధులను మాత్రం మంగళగిరి క్యాంప్ ఆఫీసు నుంచే చేపడతారు అని అంటున్నారు. అంతే కాదు ఇక మీదట క్యాంప్ ఆఫీస్ నుంచే అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దీంతో తమ అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలు పెండింగులో :

ఇక పవన్ కళ్యాణ్ పర్యటనలు ప్రస్తుతం పెండింగులో పడ్డాయి. ముందుగా అనుకున్న విధంగా అయితే ఆయన పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు వెళ్ళాల్సి ఉంది. వాటి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి మొదట పవన్ సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని వైద్యులు హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.

ఉత్సాహపూరితమైన వాతావరణం :

దాంతో అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేసినట్లుగా అంటున్నారు. అంతే కాదు దీని వల్ల ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అందుకే పవన్ తన క్షేత్ర స్థాయి పర్యటనలకు మరింతకాలం విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచే అంతా మానిటరింగ్ చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కుడి భుజం ఆపరేషన్ చేయించుకుని తిరిగి క్యాంప్ ఆఫీసుకు రావాలనుకోవడంతో అక్కడ అంతా ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది. పవన్ ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల జనసైనికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News