ఆంధ్రాలోనే దిక్కులేదూ...పవన్ ది ఆగ్రహమా అసహనమా ?
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఫ్లో లో అన్నారా లేక అనాలని అన్నారా అన్నది తెలియదు కానీ ఒక మాట అనేశారు.
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఫ్లో లో అన్నారా లేక అనాలని అన్నారా అన్నది తెలియదు కానీ ఒక మాట అనేశారు. తెలంగాణాలో జనసేన రాకూడదా మీకు ఎందుకంత భయం అని ఆయన నిగ్గదీశారు. మేము ఇక్కడకి వచ్చి ముఖ్యమంత్రులు అయిపోతామా ఆంధ్రాలోనే దిక్కు లేదు కదా మాకు అని అన్నారు. ప్రెస్ మీట్ ఆద్యంతం చూస్తున్న వారికి ఈ మాటలు ఒక్క సారిగా షాక్ గా మారాయి. పవన్ అభిమానులు అయితే విస్తు పోవాల్సి వచ్చింది పవన్ ఎందుకు ఇలా అన్నారు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. ఆంధ్రాలో పవన్ పార్టీ బాగానే ఉంది కదా, పైగా ఆయన గత రెండేళ్ళుగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు అది కూడా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో అని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆయన తనక్ ఆంధ్రాలోనే దిక్కు లేదు అని అనడానికి రీజన్స్ ఏంటి అని అంతా చర్చిస్తున్నారు.
ఆగ్రహంతోనేనా :
దీని కంటే ముందు ఆయన మరో మాట అన్నారు. తాను 2019 ఎన్నికల్లో ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు అని. అపుడు తెలంగాణాకు చెందిన జనసేన నేతలు తన వద్దకు వచ్చి అన్నా మా తెలంగాణాలో పోటీ చేసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారని చెప్పారు. అంటే తెలంగాణాలో పోటీ చేస్తే పవన్ ని గెలిపించుకుంటామని వారు చెప్పారు అన్న మాట.మరి ఏపీలో పవన్ ని ఓడించారు అన్నది ఆయన మదిలో బాధగా ఇప్పటికీ ఉందా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు తనకు సీఎం కావడానికి అక్కడే దిక్కు లేదు అన్నది కూడా అసహనంతో నేనా అని కూడా చర్చించుకుంటున్నారు.
ఏపీలో ఎందుకు లేదు :
అదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఏపీలో ఎందుకు పవన్ సీఎం కాకూడదు, ఎందుకు దిక్కు లేదు, అసలు ఆయనలో ఎందుకు ఇంత నైరాశ్యం అని కూడా చర్చకు వస్తోంది. నిజంగా పవన్ తలచుకుంటే ఏపీ రాజకీయాల్లో సక్సెస్ కాలేరా అన్నది కూడా మరో ప్రశ్న. లేక కూటమిలోనే ఉంటూ అలాగే పొత్తులతోనే వెళ్తూ ఈ విధంగానే ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాల్సి వస్తుందని ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తోంది.
తెలంగాణాలో కాదు కానీ :
నిజమే తెలంగాణాలో సెంటిమెంట్ ఉంది. నీరు నిధులతో పాటు స్వయం పాలన కోసం వారంతా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు. అందువల్ల తెలంగాణాలో జనసేనకు ముఖ్యమంత్రి సీటుని అందుకునే అవకాశం కుదరకపోవచ్చు కానీ ఏపీలో ఎందుకు కాదు అన్నది అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. పవన్ కోపంలో అన్నారో మరే విధంగా అన్నారో తెలియదు కానీ ఏపీ జనసేన నేతలు అంతా షాక్ అయ్యేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. పవన్ మా సీఎం అని ఏపీలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎప్పుడో ఒకపుడు సీఎం అవుతారు అని కూడా ఊహిస్తున్నారు. అలాంటిది ఏపీలోనే దిక్కు లేదని పవన్ అనడం మాత్రం ఇబ్బంది కలిగించేలానే ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ జై తెలంగాణా అంటూ తన ప్రెస్ మీట్ ని మొదలెట్టి గట్టిగానే మాట్లాడారు కానీ ఏపీలో తన రాజకీయం గురించి మాట్లాడిన మాటలు మాత్రం ఒక బిగ్ డిబేట్ కి ఆస్కారం కలిగించడమే కాదు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని అంటున్నారు.