అడవి మధ్యలో భూమి పెద్దిరెడ్డికి ఎలా వచ్చింది.. పవన్ ప్రశ్న
పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. ఆయన కుటుంబ సభ్యుల చేతికి 104 ఎకరాల అటవీ భూములు ఎలా వచ్చాయన్న దానిపై నివేదిక ఇవ్వాలని కోరారు.;
వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని అధిక్యను ప్రదర్శించటంతో పాటు.. తాను ఏమనుకుంటే అది జరగాలన్నట్లుగా వ్యవహరించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుండెల్లో గుబులు పుట్టేలా ప్రశ్నను సంధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అడవి మధ్యలో ఉన్న భూమి అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఎలా వచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన పాయింట్ పట్టుకొని ప్రశ్నించిన పవన్.. అటవీ అధికారులకు తాజా ఆదేశాల్ని జారీ చేశారు.
పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. ఆయన కుటుంబ సభ్యుల చేతికి 104 ఎకరాల అటవీ భూములు ఎలా వచ్చాయన్న దానిపై నివేదిక ఇవ్వాలని కోరారు. భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని.. దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా అటవీ శాఖాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ పవన్ ప్రస్తావించిన అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024 ఎన్నికల్లో అటవీ భూములపై అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని అందించారన్న విషయం తన వరకు వచ్చిందని.. ఆ అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న పవన్.. ‘భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 40.80 ఎకరాలు వారి అధీనంలో ఉంటే.. వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి 77.54 ఎకరాలుగా చూపినట్లుగా పేర్కొన్నారు.
ఒకేసారి ఎందుకు అంత పెరిగిందన్న విషయాన్ని పరిశీలించాలని అధికారుల్ని పవన్ కోరారు. మంగళంపేట అటవీ భూముల అక్రమాటపై విజిలెన్స రిపోర్టు ఎంతోకీలకమని.. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల పూర్తి వివరాలు అందులో ఉన్నాయని.. వాటిని ప్రాతిపదికన తీసుకోవాలన్న పవన్ మాటల్ని చూస్తే.. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే.. అధికారులతో మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా పెద్దిరెడ్డి భూములపై పవన్ పెట్టిన ఫోకస్ రానున్న రోజుల్లో పలు సంచలనాలకు కారణంగా మారతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.