ప్రజలు ఏం కోరుకుంటున్నారు? డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ లో ఆసక్తికర అంశాలు
అయితే ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య ఎక్స్ వేదికగా సాగిన సంభాషణ ఇంటర్నెట్ లో తీవ్ర చర్చకు దారితీసింది.;
ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం కావాలి? ఉచిత పథకాలతో సంక్షేమ పాలన సాగాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారా? అభివృద్ధి పథకాలను ఆశిస్తున్నారా? అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఉండాలని అనుకుంటున్నారా? పాలకులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకుల మధ్య ఎప్పుడూ ఈ డిబేట్ జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రజల తీర్పు మాత్రం చాలా డిఫరెంటుగా ఉంటుంది. అయితే ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య ఎక్స్ వేదికగా సాగిన సంభాషణ ఇంటర్నెట్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
16 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో పాలనా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో పరిపాలన అంశాలపై ఎక్కువగా అధికారులపై ఆధారపడిన ఆయన ఇప్పుడు తన అనుభావాన్ని జోడించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు.
ఏడేళ్ల క్రితం 2018లో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించగా, అప్పట్లో బాధితులతో పవన్ మాట్లాడిన ఫొటోను నాదెండ్ల మనోహర్ తాజాగా ఎక్స్ లో షేర్ చేశారు. ఈ పోస్టులో తాను ఉప ముఖ్యమంత్రి పవన్ తో మొదలుపెట్టిన ప్రయాణంపై అనుభవాలను వివరించారు. క్లిష్ట సమయాల్లో పవన్ తమను ఎలా మోటివేట్ చేశారో అందులో వెల్లడించారు. దీనిపై ఎక్స్ లో పవన్ స్పందించారు. నాదెండ్ల పోస్టును రీట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు పోస్టు చేశారు.
తనకు ఇప్పటికీ తుపాను బాధితులతో మాట్లాడిన విషయాలు గుర్తున్నాయని తెలిపిన పవన్, ప్రజలు ఉచితాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. వారు ఉచితాలను అడగడం లేదు, వారు ఎటువంటి సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు కానీ ‘మాకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలు కాదని గట్టిగా చెప్పారని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలని వారి కలలను నెరవేర్చుకోవడానికి అర్థం చేసుకోడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటానని ఉద్ఘాటించారు.