పిఠాపురం ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచిమరో ఎత్తు అన్నవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచిమరో ఎత్తు అన్నవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. కాపులకు కంచుకోట అయిన పిఠాపురం నుంచి అనేక మంది గతంలో విజయం దక్కించుకున్నా.. ఇక్కడి సమస్యల పరిష్కారంపై పెద్దగా దృష్టి పెట్టలేక పోయారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 211 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఇవీ తాజా ప్రాజెక్టులు..
+ 10 కోట్ల రూపాయలతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్.
+ కోనపాపపేటలో మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్.
+ ఉపాధి హామీ, ఆర్ అండ్ బి నిధులతో అద్దంలాంటి రహదారుల నిర్మాణం.
+ గోకులాలకు సంబంధించి పశువుల యూనిట్ల ఏర్పాటు.
ప్రజల మధ్యకు..
పీఠికాపుర సంక్రాంతి-పేరుతో పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్.. శుక్రవారం సాయంత్రం.. స్థానిక ప్రజలతో మమేకం అయ్యారు. స్థానిక ఓ కళాశాల మైదానం నుంచి కుక్కుటేశ్వరస్వామి ఆలయం వరకు ఆయన కాలినడకన పర్యటించారు. వీధి వీధినా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ ఇంటి స్థలాల సమస్యను ప్రస్తావించారు. అదేసమయంలో మరికొందరు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల గురించి చెప్పారు. దీంతో పవన్ అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
స్టేషన్ తనిఖీ..
పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని అన్ని గదులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఎన్ని ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రివేళ గస్తీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.