16 నెలల్లో చేసి చూపిన పవన్.. థాంక్యూ అంటున్న పిఠాపురం జగనన్న కాలనీ వాసులు

మాటలు అందరూ చెబుతారు. కానీ.. కొందరు తక్కువగా మాటలు చెప్పి.. చేతల్లో ఎక్కువగా చేసి చూపిస్తారు.;

Update: 2026-01-11 04:35 GMT

మాటలు అందరూ చెబుతారు. కానీ.. కొందరు తక్కువగా మాటలు చెప్పి.. చేతల్లో ఎక్కువగా చేసి చూపిస్తారు. ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ రెండో రకం. ఏపీకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న ఆయన.. తన శాఖ పరిధిలోని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేసి చూపిస్తున్నారు. పదహారు నెలల కాలంలో తన శాఖ పరిధిలోని పలు పనుల్ని ఇప్పటికే పూర్తి చేసి చూపిస్తున్న ఆయన పని తీరుపై అభినందనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి సిత్రం ఒకటి చోటు చేసుకుంది.

జగన్ ప్రభుత్వ హయాంలో సర్కారీ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం తెలిసిందే. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఇచ్చిన భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న వారు.. తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్న పరిస్థితి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారులోని జగనన్న కాలనీ ఒకటిగా చెప్పొచ్చు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఈ ప్రాంతానికి ఎవరైనా వెళ్లాలంటే.. కచ్ఛితంగా పడవలో వెళ్లాల్సిందే. ఎందుకంటే.. ఈ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్దగెడ్డ వాగు ఉండటంతో.. వరదలకు దారి మునిగిపోతుంది. ఈ సమయంలో వాగు దాటాలంటే పడవలోనే ప్రయాణించాల్సిందే.

ఇలాంటి చోట్ల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇవ్వటానికి ముందు వంతెన నిర్మించాల్సి ఉంది. కానీ..అవేమీ పట్టించుకోకుండా దాదాపు 2100 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. అప్పటివరకు ఇళ్లు లేవని బాధ పడిన వారికి.. ఇంటి సమస్య తీరినా.. బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి. ఇక.. గర్భిణులకు పురిటి నొప్పుల వేళ నరకం కనిపించే పరిస్థితి. ఈ సమస్యల గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో వరదలు రావటంతో దారి మొత్తం మునిగిపోవటం.. ఆ ప్రాంతానికి వెళ్లటానికి స్వయంగా పడవలో వెళ్లాల్సి వచ్చింది.

అక్కడి వారి సమస్యల గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. పరిష్కారంలో భాగంగా వంతెన నిర్మాణం పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు తగ్గట్లే రూ.3 కోట్ల నిధులతో పదహారు నెలల వ్యవధిలో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసిన వైనంతో అక్కడి వారందరికి పవన్ ఇప్పుడు దేవుడు అయ్యాడు. తాజాగా ఆయన తన వాహనంలో వంతెన మార్గంలో ప్రయాణించి..వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలువురు ‘థాంక్యూ డిప్యూటీ సీఎం సర్’ అంటూ తమ ఆనందాన్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. మాట ఇవ్వటం వేరు. ఇచ్చిన మాటను పూర్తి చేసి చూపే విషయంలో పవన్ కల్యాణ్ రూటు సపరేటు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కీపిటప్ పవన్!

Tags:    

Similar News