జనసేన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గట్టిగానే
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఫ్యూచర్ పాలిటిక్స్ మీదకు మళ్ళుతున్నాయా అన్నది చర్చగా ఉంది.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఫ్యూచర్ పాలిటిక్స్ మీదకు మళ్ళుతున్నాయా అన్నది చర్చగా ఉంది. ఆయన మంగళగిరిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన కీలక సమావేశంలో చేసిన దిశా నిర్దేశం చూస్తే కనుక ఆయన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గట్టిగానే ఉండబోతోంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే జనసేన కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉంది. అయితే కేవలం 21 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 135 సీట్లు టీడీపీకి ఉన్నాయి. దానికి కారణం 2024 ఎన్నికల్లో జనసేన పట్టుబట్టకుండా ఇచ్చిన సీట్లనే తీసుకుంది. అంతే కాదు మొదట 24 సీట్లు ఇచ్చి అందులో మూడు కోత కోసినా కూడా సర్దుకుంది. దానికి కారణం కూటమి గెలవాలి, వైసీపీ ఓడాలి, రాష్ట్రం బాగుండాలి అన్న ఏకైక అజెండాతో మాత్రమే అని అంటున్నారు.
గౌరవం ఓకే కానీ :
ఇక గత పదహారు నెలలుగా ఏపీలో కూటమి పాలన సాగుతోంది. పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు తరువాత స్థానం కూడా ఇచ్చారు. అంతే కాదు ప్రతీ ప్రభుత్వ ఆఫీసులో ఆయన ఫోటోను కూడా పెడుతున్నారు. మామూలుగా అయితే ఇది ప్రోటోకాల్ అయితే కాదు, కానీ ఆయనకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం గురించి చెప్పడానికే ఇదంతా చేస్తున్నారు అనుకోవాలి. ఇక పవన్ కి కీలక శాఖలే ఇచ్చారు. జనసేనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా ఇచ్చారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఒక పద్ధతి ప్రకారం చాన్స్ దక్కుతోంది. ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ అసలైన అధికారం అన్నది మాత్రం ఎక్కడ అన్న చర్చ సాగుతూనే ఉంది అని అంటున్నారు.
వర్షాకాలం సెషన్ తో :
తాజాగా జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశం అయితే జనసేనకు కొంత ఇబ్బందికరంగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే కూటమి మంత్రులను టీడీపీ నుంచి గట్టిగా టార్గెట్ చేశారు. ఏకంగా పవన్ నే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు గుచ్చి గుచ్చి ప్రశ్నించిన సందర్భం ఉంది. మరో సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ని కూడా ప్రశ్నించారు వీటికి పరాకాష్ట అన్నట్లుగా ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో లేని చిరంజీవి ప్రస్తావనను తెచ్చి అవమానించారు అన్నది కూడా ఒక బలమైన సామాజిక వర్గంలో గట్టిగానే ఉంది. ఇవన్నీ కూడా జనసేనలో ఇపుడు తీవ్రమైన చర్చగా మారుతోంది.
నంబర్ గేమ్ తోనే అంతా :
జనసేన బలం టీడీపీ బలం కలసి ఈ విజయాన్ని అందించాయి. కానీ ఇపుడు చూస్తే అధికారం సంఖ్యాబలం మీద ఆధారపడి సాగుతుంది. పవర్ ఎపుడూ నంబర్ గేమ్ చుట్టూనే గిర్రున తిరుగుతుంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ చాలా పెద్ద పార్టీ. జనసేన కంటే సంఖ్యలో ఏడు రెట్లు ఎక్కువ సీట్లు కలిగిన పార్టీ. దాంతో సహజంగానే టీడీపీ మాట చెల్లుబాటు అవుతోంది పై స్థాయిలో చంద్రబాబు పవన్ ల మధ్య ఇచ్చి పుచ్చుకునే విధానం ఉన్నా మిగిలిన స్థాయిలలో నాయకులలో మాత్రం జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. అదే అసంతృప్తిగా లేదా వేరే విధంగా మారి చివరికి జనసేన ను టార్గెట్ చేసే విధంగా మారుతోంది అని అంటున్నారు.
ఈసారి అలా ఉండదా :
అందుకే జనసేన సీరియస్ గానే ఈసారి దృష్టి పెడుతోంది అని అంటున్నారు. తాము జూనియర్ పార్టనర్ గా కూటమిలో ప్రస్తుతం ఉన్న సంగతికి గుర్తెరిగిన నాయకత్వం ఫ్యూచర్ లో బలపడాలని చూస్తోంది అని అంటున్నారు. అందుకే ఏకంగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు వచ్చే ఎన్నికల్లోగా అసెంబ్లీ సీట్లు మరో యాభై దాకా పెరిగితే దానికి తగినట్లుగానే జనసేన కూడా ఎక్కువ సీట్లు కోరుతుంది అని అంటున్నారు. ఒకవేళ అలా కాకుండా 175 సీట్లతోనే 2029 ఎన్నికలు జరిగినా కూడా ఈసారి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే విధంగా జనసేన రానున్న రోజులల్లో కార్యాచరణ ఉండబోతోంది అని అంటున్నారు. సీట్లు కోరాలీ అంటే ఆయా ప్రాంతాల్లో తాము బలంగా ఉండాలి. అందుకే జనసేన రాబోయే మూడున్నరేళ్ల పాటు వంద సీట్ల పరిధిలో పార్టీని బలోపేతం చేసుకుంటే గరిష్టంగా ఎన్ని సీట్లు పొత్తులో తీసుకోవాలలో అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయిస్తుంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటుంది కానీ సీట్ల విషయంలో పట్టు పెంచే విధంగా జనసేన రాజకీయం ఉండబోతోంది అని అంటున్నారు.