బరువు అంతా పవన్ దేనా...పరిష్కారమేంటి ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే జనసేన అల్లుకుని ఉంది. అది సహజం కూడా. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో ఇదే విధంగా నిర్మాణం ఉంటుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే జనసేన అల్లుకుని ఉంది. అది సహజం కూడా. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో ఇదే విధంగా నిర్మాణం ఉంటుంది. పవన్ కి ఆ విధంగా పార్టీ బరువు బాధ్యతలు అన్నీ మోయాల్సిన అనివార్యత ఏర్పడింది. అదే సమయంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే అధికారిక బాధ్యతలు కూడా ఆయనకు ఉన్నాయి. పైగా అయిదు శాఖలు. అవి కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి. దాంతో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కీలక బాధ్యతలతో పవన్ ఒక విధంగా పెను భారమే మోస్తున్నారు అని అంటున్నారు. ఈ రకమైన సమస్య పవన్ ఒక్కరికేనా వైసీపీ టీడీపీలలో లేదా అంటే అక్కడ కూడా అల్టిమేట్ డెసిషన్ అధినాయకత్వానిదే. కానీ పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉంచుకున్నారు. దాంతో వారి మీద భారం తగ్గుతోంది అని అంటున్నారు.
వైసీపీ తీరు వేరుగా :
వైసీపీ విషయానికి వస్తే జగన్ పార్టీ బాధ్యతలను సీనియర్లకు అప్పచెబుతూంటారు. వారి ద్వారానే తాను వాటిని తెలుసుకుని తగిన పరిష్కారాలు చూస్తారు. టీడీపీలో అయితే అన్నీ తానై చేసుకునే అలవాటు చంద్రబాబుకు ఉంది. అయితే చంద్రబాబు సైతం సీనియర్ల టీం ని రెడీ చేసి ఉంచుతారు. అలాగే పార్టీకి విస్తృతమైన యంత్రాంగం ఉంది. అలా లాస్ట్ డెసిషన్ గా అధినాయకత్వం వద్దకు సమస్యలు ఏవైనా వస్తాయి. జనసేనలో చూస్తే అలాంటి యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
కీలక కమిటీతోనే :
పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వారు కూడా జనసేనలో కనిపిస్తారు. అలాంటి వారిలో ఎంపిక చేసిన కొందరితో కమిటీని జనసేన ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సూచనలు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేనల మధ్య కో ఆర్డినేషన్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఆధిపత్య పోరుతో ఆయా సీట్లలో సమస్యలు పెద్దవిగా మారుతున్నాయి. వాటి గురించి వచ్చే ఫిర్యాదులు కానీ లేదా వాటిని సావధానంగా ఆలకించి పరిష్కారం కనుగొనడం కానీ చేయాల్సిన బాధ్యత జనసేనకు ఉంది. అయితే అన్నీ ఇపుడు నేరుగా పవన్ కళ్యాణ్ చూడాల్సి వస్తోంది అని అంటున్నారు. అందుకే వీటిని చూసుకునే వీలుగా కమిటీని ఒక దానిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు.
చిన్నవే పెద్దవిగా :
ఈ రోజున చిన్నవిగా ఉన్న సమస్యలే తరువాత కాలంలో పెద్ద సమస్యలుగా మారుతాయి. తమ పార్టీ వారికి నచ్చచెప్పాలి. అదే సమయంలో పార్టీ అస్తిత్వం దెబ్బ తినకుండా చూసుకోవాలి. ఇక పార్టీలో ఏమి జరుగుతోంది అన్నది గ్రౌండ్ లెవెల్ నుంచి నివేదికలు పక్కాగా ఉండాలి, వాటి మీద అధ్యయనం చేయాలి. ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. అధినాయకుడి స్థాయిలోనే అన్నీ సాగడం అంటే కుదరని పని అంటున్నారు. అయితే జనసేనలో ఉన్న వారు అంతా పవన్ కోసమే చూస్తున్నారు. ఆయనే ఏదైనా చెప్పాలని భావిస్తున్నారు. కానీ పార్టీ అన్నాక అంచెలంచెలుగా నిర్మాణం ఉంటుంది. అలా చేసుకుంటేనే పవన్ కి పార్టీకి కూడా మేలుగా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేనలో మరింతగా వ్యవస్థల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు.