పవన్ జీ... ఆ డైలాగులు వద్దు జీ !

ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు.;

Update: 2025-06-26 03:56 GMT

ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన మాట్లాడటం కాదు చట్టంతో మాట్లాడించాలి. ఆయన ఆవేశం కాదు ఆచరణ కనిపించాలి. కానీ పవన్ ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భీకరమైన ప్రకటనలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా వెలగపూడిలో తాజాగా నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పవన్ దాదాపుగా ఇరవై నిముషాల నుంచి అరగంట పాటు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానిలో ఎక్కువ భాగం ప్రభుత్వ పాలన గురించి విజయాల గురించి చెప్పుకొచ్చారు.

అయితే చివరలో మాత్రం ఆయన వాడిన కొన్ని మాటలే విమర్శల పాలు అయ్యాయి. తొక్కి నార తీస్తాం, కాళ్ళూ కీళ్ళూ తీసి మూలన కూర్చోబెడతాం అన్న మాటలు ఉప ముఖ్యమంత్రి హోదాకు తగినవి కావు అని అంటున్నారు. అరాచక శక్తుల పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరి ఉండవచ్చు. అంతే తప్ప తొక్క తీస్తామని తోలు తీస్తామని మాట్లాడడం ఔచిత్యం అనిపించుకోదని అంటున్నారు.

ఒక వైపు ఏపీలో వైసీపీ నేతలు రప్పా రప్పా అంటున్నారని విమర్శలు ఉన్నాయి. వారి భాష మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పెద్దలు కూడా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఎపుడూ అధికారంలో ఉన్న వారి మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుందని అంటున్నారు.

ఎందుకంటే ఫోకస్ ఎపుడూ అటువైపుగా ఉంటుంది ఇక ప్రతిపక్షం తీసుకుంటే కవ్విస్తుంది. రెచ్చగొడుతుంది అయితే ఆ ట్రాప్ లోకి పడరాదు అన్నదే అందరి సూచనలూ. కానీ పవన్ ఒక్కోసారి ఆవేశంతో చేసే వ్యాఖ్యలే చర్చకు కారణం అవుతూంటాయి. ప్రభుత్వంలో ఉన్న వారుగా యాక్షన్ లోకే దిగాలి. తమ ప్రభావం అంతా అక్కడే కనిపించాలి.

వెనకటి రోజులలో అయితే మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి ముఖ్యమంత్రులు అయితే మాటలు చాలా హుందాగా పొదుపుగా వాడేవారు. యాక్షన్ లోనే అంతా ఉండేది. అందుకే సమర్ధులైన సీఎంలుగా పేరు తెచ్చుకున్నారు అయితే రాజకీయం మారింది. పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ భాష కూడా మారింది. అంత మాత్రం చేత మరీ ఈ విధంగా మాట్లాడితే జనాలు మెచ్చరని అంటున్నారు.

దీని మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ పవన్ మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు ప్రభుత్వ వేదిక మీద నుంచి బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా బెదిరింపులతో మాట్లాడడం మానుకోవాలని అన్నారు. వైసీపీ నేతలకు నీతులు చెప్పే క్రమంలో తాను కూడా ఆ భాషనే వాడుతున్నాను అని ఆయన గ్రహించాలని సూచించారు.

Tags:    

Similar News