సినిమాలు రాజకీయాలు...పవన్ ప్లాన్ అదేనట ?
ఇక పవన్ ఫ్యాన్స్ ఆయనను వెండి తెర మీద చూడాలని మనసారా కోరుకుంటున్నారు.;
ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. ఆ ఇమేజ్ ఆకాశమంతా. ఆయనను తెర మీద ఈలలు గోలలు చేసే ఫ్యాన్స్ కోకొల్లలు. కట్ చేస్తే రియల్ లైఫ్ లో ఆయన జనసేనాని. ఏపీలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. ఇలా పవన్ తీరికలేనంత బిజీగా ఉన్నారు. సినిమాల నుంచే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలా సినీ కళామతల్లిని వదలలేని స్థితి. అదే సమయంలో రాజకీయాలు ఆయనకు ఇష్టం. ప్రజా సేవ చేయాలన్నది ఆయన లక్ష్యం. ఈ రెండూ అపరిమితమైన అభిమాన జనం కలిగిన రంగాలే. దాంతో ఈ రెండు రంగాలలో ఇపుడు అగ్ర భాగాన ఉన్న పవన్ ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది.
సినిమాలకు రిటైర్మెంటేనా :
పవన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఓజీ షూటింగ్ ఎపుడో పూర్తి అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సైతం తాజాగా కంప్లీట్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ సెప్టెంబర్ 25న దసరా పండుగ వేళ ఓజీ వస్తే వచ్చే ఏడాది సమ్మర్ వెకేషన్స్ కి భగత్ సింగ్ వస్తుంది అని అంటున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ కి 26 దాకా సినీ ఫీస్ట్ ని పవర్ స్టార్ ఇచ్చేశారు. మరి ఆ తరువాత ఏమిటి అంటే రిటైర్మెంటేనా అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే అలా కాదని జస్ట్ ఒక విరామం మాత్రమే అని అంటున్నారు.
ఎన్నికల ముందు మళ్ళీ :
ఇదిలా ఉంటే పవన్ సినిమాలకు విరామం ప్రకటిస్తారు తప్ప రిటైర్మెంట్ అన్నది ఉండదని అంటున్నారు. ఆయన రెండేళ్ళ పాటు రాజకీయాల్లో ఫుల్ బిజీ అవుతారని తిరిగి ఎన్నికల ముందు ఒక సినిమా చేసి విడుదల చేసే చాన్స్ ఉందని అంటున్నారు. మంచి కంటెంట్ తో సినిమాను ఎన్నికల వేళ జనం ముందుకు తేవాలన్న ఆలోచనలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ లోగా మాత్రం ఆయన రాజకీయాలలోనే తీరిక లేనన్ని పనులతో ఉంటారు అని అంటున్నారు. అటు ప్రభుత్వంలో అధికారిక కార్యక్రమాలను చూసుకుంటూ మరో వైపు ప్రజా జీవితంలోకి రావాలి. అలాగే పార్టీని బలోపేతం చేయాలి. ఇలా అనేక కారణాల వల్లనే పవన్ రెండేళ్ల పాటు షూటింగ్ కి సినిమాలకు దూరంగా ఉంటారని అంటున్నారు.
వారసుడి ఎంట్రీ అపుడేనా :
ఇక పవన్ ఫ్యాన్స్ ఆయనను వెండి తెర మీద చూడాలని మనసారా కోరుకుంటున్నారు. దాంతో తన కుమారుడు అకీరా నందన్ కి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా కరెక్ట్ సమయం కోసం పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. అలా కుమారుడిని హీరోగా చేసి తాను అవసరమైన సందర్భాలలో సినిమాలలో నటిస్తారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట.
బ్యాలెన్స్ చేసుకుంటూనే :
సినిమాల వల్ల వచ్చిన ఇమేజ్ ఈ రోజున పవన్ ని రాజకీయంగా బలంగా నిలబెట్టింది అని అంటారు. అందువల్లనే సినిమాలను వీడేది ఉండదని అంటున్నారు. అంతే కాదు తనకు ఉన్న అతి పెద్ద ఆర్ధిక వనరుగా సినిమాలే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల సినిమాల్లో నటించడం ద్వారానే అది సాధ్యమని భావిస్తున్నారు. మొత్తం మీద రెండు రంగాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నదే పవన్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తం మీద పవన్ తీసుకునే నిర్ణయాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీగానే ఉంటాయని అంటున్నారు. రానున్న కాలంలో కూడా ఆయన సందేశాత్మక సినిమాల్లో నటించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని అంటున్నారు. సో పవన్ సినిమాలకు దూరం కాదు చిన్న విరామం మాత్రమే ఇచ్చారు అని అంటున్నారు.