టీవీకే విజయ్ కు పవన్ కల్యాణ్ మాటలు బూస్ట్ ఇస్తాయా?
ఇందులో భాగంగా... ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో చేతులు కలిపి పోటీ చేస్తే బెటరని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.;
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నిలిచారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకోబోయే నిర్ణయాలను ప్రభావితం చేసే దిశగా పలు రాజకీయ పార్టీల అధినేతలు, కూటముల మిత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో విజయ్ కి పవన్ ఫోన్ చేశారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... కరూర్ లో సెప్టెంబరు 27న విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా సుమారు వందమందికి పైగా గాయపడిన సంగతి విషయం తెలిసిందే. అటు రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా తివ్ర కలకలం రేపిన ఈ దుర్ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసిందని చెప్పుకోవాలి. పైగా నిన్నమొన్నటివరకూ దూకుడుగా వ్యవహరిస్తున్న విజయ్ సడన్ గా మెతకబడిపోయారనే కామెంట్లు వినిపిస్తున్న పరిస్థితి.
పవన్ కల్యాణ్ నుంచి ఫోన్?:
ఇలా కరూర్ దుర్ఘటన తర్వాత విజయ్ పరిస్థితి ఉన్నంతంలో అగమ్యగోచరంగా మారిందని.. ఆయన మానసికంగా కాస్త కృంగిపోయారని.. మరోవైపు పార్టీ నిర్వాహకులపై కేసులు, అరెస్టులు.. వెరసి ఆయనను తీవ్ర సమస్యల్లోకి నెట్టేసాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కు అండగా తామున్నామంటే తామున్నామని పలు రాజకీయ పార్టీలు.. ప్రధానంగా ఎన్డీయే కూటమి ముందుకు కదిలిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఎన్డీయే కూటమిలోని పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచి విజయ్ కు ఫోన్ వెళ్లిందని.. ఈ మేరకు ఆ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిసామి ఫోన్ ద్వారా విజయ్ ను సంప్రదించి, కూటమిలోకి ఆహ్వానించారని అంటున్నారు. ఈ సమయంలో ఎన్డీయే పార్టీలోనే మరో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా విజయ్ కు ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగా... ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో చేతులు కలిపి పోటీ చేస్తే బెటరని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దానివల్ల.. ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చని, ఒకవేళ ఓడిపోతే ప్రతిపక్ష నేతగానైనా ఉండొచ్చని విజయ్ కు పవన్ కల్యాణ్ తన అనుభవాలను రంగరించి సూచించినట్లు కథనాలొస్తున్నాయి.
దీంతో.. పవన్ కల్యాణ్ సూచనల్లో తప్పేమీ కనిపించడం లేదని ఒకరంటే... అలా చేస్తే మార్పు కోసమని విజయ్ చేస్తున్న ప్రయత్నాలు సాధ్యకాకపోవచ్చేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమందైతే... విజయ్ కు ఫోన్ చేసింది నిజమైతే పవన్ సూచనలు ప్రాక్టికల్ గా ఉన్నాయని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు.