బీఆర్ఎస్ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో కూడా పవన్ ఇదే విషయం రెండు మూడు సందర్భాలలో చెప్పారు. ఆయన ఆలోచనలు ఏమిటి అంటే భావోద్వేగాల కంటే రాష్ట్రం దేశం ముఖ్యం అని.;

Update: 2025-08-29 12:30 GMT

తెలంగాణాలో బీఆర్ఎస్ ఉంది. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ గురించి ఎందుకు ప్రస్తావించారు అన్నదే ఇక్కడ ఆసక్తికరం. నిజానికి బీఆర్ఎస్ తెలంగాణాకే పరిమితం అయిన పార్టీ. అలాంటిది ఏపీలో తన పార్టీ సమావేశాలలో పవన్ ఎందుకు ఆ పార్టీని గుర్తు చేసుకున్నారు దానికి తగిన సందర్భం ఏమిటి అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అయితే పవన్ ఏది మాట్లాడినా లాజిక్ తోనే ఉంటుంది. ఇది కూడా అలాగే ఆయన చెప్పారు అని అభిమానులు అంటున్నారు. ఇక్కడ ఆయన బీఆర్ఎస్ మీద ఏమీ రాజకీయ విమర్శలు అయితే చేయలేదు అన్నది కూడా అంతా గమనించాల్సి ఉంటుంది అంటున్నారు.

పేరు మార్పు మీదనే :

గతంలో కూడా పవన్ ఇదే విషయం రెండు మూడు సందర్భాలలో చెప్పారు. ఆయన ఆలోచనలు ఏమిటి అంటే భావోద్వేగాల కంటే రాష్ట్రం దేశం ముఖ్యం అని. భావోద్వేగాలు ప్రాంతీయంగా సామాజికంగా ఇతరత్రా ఉండవచ్చు. అవి పుట్టినపుడు ఆ వేడి బాగా ఉంటుంది. అయితే కాలగమనంలో పరిస్థితులు మారినపుడు అనేక పరిణామాలు చోటు చేసుకున్నపుడు అవి కాస్తా చల్లబడి అసలు విషయాలు అర్ధం అవుతాయి. ఈ విషయం గురించి ఆయన గట్టిగా చెబుతూనే తెలంగాణా వాదంతో పుట్టిన పార్టీగా టీఆర్ఎస్ అని పెట్టుకున్నారని కాల గమనంలో దానిని బీఆర్ఎస్ గా మార్చారని చెప్పుకొచ్చారు.

భావజాలానికి పరిమితులు :

ఏదైనా భావజాలం ఉంటే దానికి కొంత పరిధి పరిమితులు ఉంటాయని పవన్ విశ్లేషించారు. అది సర్వకాల సర్వావస్థలకు వర్తించేదిగా ఉండడని, దానికి శాశ్వతత్వం తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణా రాష్ట్ర సమితిగా ఆనాడు ఉన్న పార్టీ తరువాత బీఆర్ఎస్ గా మారిందని ఇదంతా కాలగమనంలో జరిగిన ప్రక్రియ చోటు చేసుకున్న పరిణామ క్రమం గా చూడాలని అన్నారు విశాఖలో జరుగుతున్న జనసేన పార్టీ సమావేశాంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగులో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు అంతరార్ధం ఉందా :

అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక అంతరార్ధం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే భావజాలం అన్నారు, అది పరిమితం అన్నారు. కాలానికి తగిన మార్పులు తప్పవని అన్నారు. మరి ఏపీలో ఏ పార్టీకైనా అలాంటి భావజాలం ఉందా అన్నదే చర్చగా ఉంది. ఇక పోతే వ్యక్తులను చుట్టూ అల్లుకున్న పార్టీలు కానీ ఆయా వ్యక్తుల మీద ఉన్న భావోద్వేగాలను రగిలించి ఏర్పాటు చేసుకున్న పార్టీలు కానీ పరిమిత కాలం మాత్రమే మనగలుగుతాయని ఏమైనా పవన్ సందేశం ఇచ్చారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు అలా చూసుకుంటే ఆయన వ్యాఖ్యలలో అర్ధాలు లోతుగానే చూడాలని అంటున్నారు

జార్ఖండ్ ముక్తీ మోర్చా సంగతేంటి :

అయితే పవన్ తెలంగాణాలో ఉంది సాటి తెలుగు రాష్ట్రం కాబట్టి బీఆర్ఎస్ ని ఉదహరించారు కానీ జార్ఖండ్ లో మరో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తీ మోర్చా ఉందిగా అని అంటున్నారు అది దశాబ్దాల పాటు కొనసాగుతోందిగా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ జార్ఖండ్ వాదాన్నే నేటికీ మోస్తూ ముందుకు సాగుతూ విజయాలు సాధిస్తోంది కదా అని అంటున్నారు. అలాగే మరాఠీల సెంటిమెంట్ తో ఆవిర్భవించిన శివసేన కానీ ద్రవిడ వాదాన్ని ఆసరాగా చేసుకుని పుట్టిన డీఎంకే అన్నా డీఎంకే కానీ ఎన్నో దశాబ్దాలుగా మనగలుగుతున్నాయి కదా అని అంటున్న వారూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్న విషయాలూ మరచిపోరాదని అంటున్నారు. మొత్తానికి పవన్ ఏ సందర్భంలో చెప్పినా భావోద్వేగాలు వేరు భావజాలం వేరు అన్నది మాత్రం అంతా గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News