బాబు రాయబారం ఫలించలేదా? ముభావంగానే పవన్.. !
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ముభావంగానే ఉన్నారా? అసెంబ్లీలో జరిగిన రెండు కీలక పరిణామా లపై ఆయన ఆవేదన చెందుతూనే ఉన్నారా? అంటే.. జనసేన వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ముభావంగానే ఉన్నారా? అసెంబ్లీలో జరిగిన రెండు కీలక పరిణామా లపై ఆయన ఆవేదన చెందుతూనే ఉన్నారా? అంటే.. జనసేన వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా శుక్రవారం ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే.. ఎప్పట్లా ఆయన.. సీఎం చంద్రబాబు పక్కన కూర్చోలేదు. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది.
కానీ, పవన్ మాత్రం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కన కూర్చున్నారు. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ సమావేశాలను పరిశీలిస్తే.. సీఎం చంద్రబాబుకు ఎడమ వైపు ఆయన కూర్చున్నారు. కానీ, ఈ సారి మాత్రం దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో కేబినెట్ భేటీలో కనీసంలో కనీసం 10 నిమిషాలైనా పవన్ గతంలో మాట్లాడేవారు. పలు విషయాలపై చర్చించేవారు. మంత్రులకు కూడా కొన్ని సూచనలు చేసేవారు. కానీ, ఈ సారి మాత్రం ఆయన మౌనంగా ఉన్నారు.
అంతేకాదు.. శుక్రవారం సాయంత్రం.. చంద్రబాబు మంత్రులతో విడివిడిగా మాట్లాడిన సమయంలోనూ.. పవన్ పాల్గొనలేదు. గతంలో ఆయన కూడా మంత్రులతో విడివిడిగా మాట్లాడి.. సమస్యలను ప్రస్తావించా రు. చంద్రబాబు పక్కనే కూర్చొని మాట్లాడారు. ఈ సారి మాత్రం కేబినెట్ భేటీకి ఇలా వచ్చి అలా వెళ్లిపో యారు. ఈ పరిణామాలతో జనసేన వర్గాలు.. పవన్ ముభావంగానే ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో.. పవన్‌ను టార్గెట్ చేస్తూ.. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలకు తోడు.. టీడీపీ ఎమ్మెల్యే, బాబు వియ్యంకుడు బాలయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ రెండు ఘటనలు జరిగిన తర్వాత.. పవన్‌ను పరామర్శించే పేరుతో సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లారు. 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వ్యవహారాలను కూడా ఆయనతో పంచుకున్నారు. అయినప్పటికీ.. పవన్ మాత్రం బాబు వ్యాఖ్యలతో ఏకీభవించలేదని తెలుస్తోంది. సభలో జరిగిన పరిణామాలపై ఆయన ఇంకా ఆవేదనతోనే ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదని మెగా స్టార్‌ను అసెంబ్లీలో వ్యాఖ్యానించడం, సెంట్రల్ ఎమ్మెల్యే జనసేన లాలూచీ పడుతోందని చెప్పడం వంటి పవన్‌కు ఇబ్బందిగా మారాయని అంటున్నారు.