సంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. 13 మంది మృతి.. అసలేం జరిగింది?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది.;
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఇందులో భాగంగా... సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా, మరో ఎనిమిది ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించారు!
అవును... పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారని తెలుస్తోంది. మరోవైపు ప్రొడక్షన్ బిల్డింగ్ కూలిపోగా, పక్కనున్న మరో భవనానికి బీటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది గాయపడగా.. వారిలో 13 మంది మృతిచెందారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మదీనాగూడ, చందానగర్ లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన మదీనాగూడలోని ప్రణామ్ ఆస్పత్రి ఎండీ మనీష్ గౌర్.. తమ వద్ద 18 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మరోవైపు సమాచారం అందిన వెంటనే 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు.
ఇదే సమయంలో... సంఘటనా స్థలాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. ఈ సందర్భంగా... క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత హరీశ్ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అదేవిధంగా... కెమికల్ ఫ్యాక్టరీలో మంటలతో పాటు భారీగా విషవాయువులు విడుదలవడంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో.. స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో.. అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి!:
పాశమైలారం పారిశ్రామికవాడలో సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 10 మంది మృతి చెందిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది! ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. పాశ మైలారం, పారిశ్రామిక వాడ, అగ్ని ప్రమాద ఘటనలో పలువురు మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.
ఇదే సమయంలో... క్షతగాత్రులక మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.
సమగ్ర దర్యాప్తు నిర్వహించాలన్న కేటీఆర్!:
పటాన్ చెరులోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఆయన... ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించాలని అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. దయచేసి గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సహాయం అందేలా చూసుకోండని కోరారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని చెప్పిన కేటీఆర్... అన్ని పారిశ్రామిక యూనిట్లకు భద్రతా ఆడిట్ లు తప్పనిసరి చేయాలని, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.