వణికించే రాక్షసి.. తనకంటే అందంగా ఉండొద్దని నలుగుర్ని చంపేసింది

విన్నంతనే ఒళ్లు జలదరింపుతో పాటు.. ఇలాంటి దుర్మార్గం కూడా ఉంటుందా? అన్న సందేహం కలిగే షాకింగ్ క్రైం ఒకటి వెలుగు చూసింది.;

Update: 2025-12-04 05:30 GMT

విన్నంతనే ఒళ్లు జలదరింపుతో పాటు.. ఇలాంటి దుర్మార్గం కూడా ఉంటుందా? అన్న సందేహం కలిగే షాకింగ్ క్రైం ఒకటి వెలుగు చూసింది. పెళ్లింట చోటు చేసుకున్న విషాదం ప్రమాదవశాత్తు కాదని.. తన కంటే ముద్దుగా ఉందన్న కారణంగా రగిలిన ఒక సైకో.. చిన్నారిని బలి తీసుకున్న వైనం ఉలిక్కిపడేలా చేసింది. పోలీసుల విచారణలో ఆమె గతంలో ఇదే రీతిలో మరోముగ్గురిని కూడా హత్య చేసినట్లుగా ఒప్పుకుందీ దుర్మార్గురాలు. చివరకు తన కన్నకొడుకును సైతం చంపేసిన ఈ మహిళను రాక్షసి అనే కన్నా అంతకు మించి అని చెప్పాలి. ఈ ఉదంతం గురించి చదువుతున్నప్పుడు జర్మన్ లో ఫేమస్ అయిన స్నో వైట్ లోని దుష్టరాణిని తలపించేలా ఈ దుర్మార్గురాలి దుర్మార్గం ఉందని చెప్పాలి.

హర్యానాలోని పానిపట్ లో జరుగుతున్న ఒక పెళ్లిలో అందంగా ముస్తాబైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన మహిళ ఉదంతంతో బంధువులు ఒక్కసారి భయాందోళనలకు గురయ్యారు. హత్య చేసిన పూనమ్.. తన మేనకోడలినే చంపటం గమనార్హం. ఆరేళ్ల విధిని నీటి తొట్టెలో ముంచి ప్రాణాల్ని తీసింది. తన కంటే అందంగా ఉండే చిన్నారులను చూసినంతనే వారి ప్రాణాలు తీసేస్తుంది.

సోనిపట్ కు చెందిన ఆరేళ్ల విధి తన కుటుంబంతో కలిసి పానిపట్ లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లింది. ఆమెతో పాటు ఆమె తాత.. అమ్మమ్మ.. తండ్రి.. తల్లి.. పది నెలల తమ్ముడితో కలిసి వెళ్లింది. పెళ్లిలో చక్కగా ముస్తాబైన విధి సంతోషంగా తిరుగుతున్న వేళ.. ఆమెపై పూనమ్ కన్ను పడింది. అంతే.. విధి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు వెతకటం మొదలుపెట్టారు.

దాదాపు గంట తర్వాత నీటి తొట్టలో మునిగిపోయి.. కాళ్లు పైకి తేలి ఉన్న విషయాన్ని గుర్తించి దగ్గర్లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు పరకటించారు. దీంతో విధి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు పూనమ్ తీరు తేడాగా ఉండటంతో ఆమెను ప్రశ్నించారు. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను నిందితురాలిగా గుర్తించారు. దీంతో మరింత లోతుగా ప్రశ్నించటంతో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

తనకంటే ఎవరూ అందంగా కనిపించకూడదని.. అలా కనిపిస్తే తీవ్ర ఆగ్రహానికి గురయ్యే పూనమ్.. 2023లో తన వదిన కుమార్తెను చంపేసింది. అదే ఏడాది ఎవరికి అనుమానం రాకూడదని తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ ఏడాది ఆగస్టులోనూ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది. పూనమ్ చెప్పే వరకు చనిపోయిన చిన్నారులంతా ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా భావించారు. ఈ సైకో ఉదంతం గురించి తెలిశాక నోట మాట రాని పరిస్థితి.

Tags:    

Similar News