పాక్ ముక్క చెక్కలు....భారత్ లోకి పీఓకే ?
పాకిస్తాన్ భారత్ మీద దండెత్తాలని చూస్తోంది. అయితే శక్తి సరిపోదు, అందుకే తరచూ ప్రేలాపనలు చేస్తూంటుంది.;
పాకిస్తాన్ భారత్ మీద దండెత్తాలని చూస్తోంది. అయితే శక్తి సరిపోదు, అందుకే తరచూ ప్రేలాపనలు చేస్తూంటుంది. ఉగ్రవాదాన్ని ఎగదోసి గత ఏడాది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా పాక్ ప్రెసిడెంట్ ఇంటి కొంప దాకా బాంబుల దాడిని తెచ్చుకున్న పాక్ కి ఆ వణుకు ఎటూ ఉంది. అయినా సరే లేస్తే మనిషిని కాను అంటుంది. ఇరాన్ తో యుద్ధం పేరుతో పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న అమెరికాకు సాయం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అదే టైం లో భారత్ మీద ఏదో విధంగా దాడి చేయాలని పాక్ వ్యూహాలు రూపొందిస్తోంది అని అంటున్నారు.
ముక్క చెక్కలు అంటూ :
ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మాట్లాడుతూ భారత నగరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే ఘర్షణలో పాకిస్థాన్ కోల్‌కతాతో సహా కీలక ప్రాంతాలలో తమ దాడులు ఉంటాయని చెప్పారు. భారతదేశం చేసే ఏ దుస్సాహసానికైనా పాకిస్థాన్ ప్రతిస్పందన అంతే వేగంగా ప్రణాళికాబద్ధమైనదిగా నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ నగరాల్లోకి జొరబడి ప్రజల ఇళ్లలోనే వారిపై దాడి చేస్తామని కూడా ప్రగల్బాలతో కూడిన ప్రకటన చేశారు. ఈసారి పాక్ భారత్ మీద చేసే దాడులు 200-250 కిలోమీటర్ల పరిధికి పరిమితం కావని అవి మరింత విస్తృతం అవుతాయని కూడా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
రాజ్ నాథ్ కౌంటర్ :
అయితే దాయాది పాక్ కి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. పాక్ ఎలాంటి దుస్సాహసం లేదా రెచ్చగొట్టే చర్యకి దిగినా ధీటైన బదులు భారత్ ఇస్తుందని ఆయన పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాజ్ నాథ్ ఈ హెచ్చరిక చేశారు అంతే కాదు 1971 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడికే తెలియాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తే పాక్ మీద కఠిన చర్యలకు దిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ నాయకత్వాన్ని కోరారు భారతదేశం సంయమనాన్ని బలహీనతగా తప్పుగా భావించవద్దని హెచ్చరించారు.
పీవోకే స్వాధీనం :
ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే ని స్వాధీనం చేసుకోవడానికి భారత్ కీలక అడుగులు వేస్తోందా అన్న చర్చ సాగుతోంది. పీఓకే ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. పాక్ అక్కడ నుంచే భారత్ సరిహద్దుల వద్ద ఉగ్రవాదాన్ని రాజేస్తోంది. ఉగ్ర క్యాంపులు అన్నీ అక్కడే ఉన్నాయి. దాంతో పీఓకేని భారత్ లో కలిపేసుకుంటే పాక్ సగానికి సగం వీక్ అవుతుంది అని అంటున్నారు. ఇక పీవోకేలో ఉన్న ముస్లింలు కూడా భారత్ లో కలిసిపోయేందుకు సుముఖంగా ఉన్నారు. దానికి కారణం గత కొన్నాళ్ళుగా కాశ్మీర్ లో అభివృద్ధి పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో కాశ్మీర్ లో వారు ఒకనాడు భాగం కాబట్టి ఇపుడు సంపూర్ణంగా కలవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. పాకిస్థాన్ పీఓకేలో ఉన్న ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దాంతో అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నారు.
కేంద్రం సీరియస్ గా :
భారత్ లోకి పీవోకే విలీనం అన్నది ఒక కీలక ప్రక్రియ. దాని మీద వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు. మరో వైపు పీవోకేని ప్రజలు కూడా భారత్ లో కలిసేందుకు సిద్ధంగా ఉండడం పాక్ మీద వారు నిప్పులు చెరుగుతూండడంతో సరైన సమయంలో ఈ ప్రక్రియ చేపడతారా అన్న చర్చ సాగుతోంది. ఇది జరిగితే పాక్ మాడు పగిలినట్లే అంటున్నారు. మరో వైపు పాక్ మీద బలూచిస్తాన్ కూడా ఆగ్రహంగా ఉంది. అలా పాక్ మరిన్ని ముక్కలు చెక్కలు అయ్యే స్థితి ఉంటుంది అని అంటున్నారు.