పాక్ - ఉగ్రవాద సంస్థల సురక్షిత స్వర్గధామం! అమెరికా కాంగ్రెస్ నివేదికలో సంచలన విషయాలు

ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ నివేదిక అధికారికంగా ముద్ర వేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.;

Update: 2026-03-31 07:30 GMT

పాకిస్థాన్‌ను ‘ఉగ్రవాదానికి కేంద్రబిందువు’ అని భారత్ దశాబ్దాలుగా గొంతెత్తి చాటుతున్న వాస్తవానికి, ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ నివేదిక అధికారికంగా ముద్ర వేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. సైనిక చర్యలు, వైమానిక దాడులు ఎన్ని చేసినా ఆ గడ్డపై ఉగ్రవాద బీజాలను తుడిచిపెట్టలేకపోయారని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. 1980ల నుంచి పాక్ వేదికగా సాగుతున్న ఈ అరాచక శక్తులు, కేవలం పొరుగు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికే ముప్పుగా మారాయన్నది ఇప్పుడు జగమెరిగిన సత్యం. అమెరికా కాంగ్రెస్ విడుదల చేసిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు వాటి వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..

పాక్ - ఉగ్రవాద సంస్థల సురక్షిత స్వర్గధామం!

అమెరికా కాంగ్రెస్ నివేదిక ప్రకారం.., పాకిస్థాన్ డజనుకు పైగా ప్రధాన ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ సంస్థలు మూడు రకాలుగా పనిచేస్తున్నాయి - ఒకటి ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకునేవి, రెండు అఫ్గానిస్థాన్‌పై కన్నేసినవి, మూడు భారత్‌ను అస్థిరపరచాలని చూసేవి. పాక్‌లోని కనీసం 12 ఉగ్రవాద గ్రూపులను అమెరికా, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అధికారికంగా ‘విదేశీ ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించాయి.

సైనిక చర్యలు విఫలం

వైమానిక దాడులు, నిఘా ఆధారిత ఆపరేషన్లు చేపట్టినప్పటికీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేకపోవడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉంది. పాక్ సైన్యం, నిఘా సంస్థలు ఒకవైపు ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు నటిస్తూనే.., మరోవైపు తమ ప్రయోజనాల కోసం కొన్ని సంస్థలకు అండదండలు అందిస్తున్నాయనే విమర్శలకు ఈ నివేదిక బలం చేకూరుస్తున్నాయి. దాదాపు ఈ సంస్థలన్నీ తీవ్రవాద ఇస్లామిక్ భావజాలంతో పనిచేస్తున్నాయి. ఇది పాక్ సమాజంలో లోతుగా పాతుకుపోవడం వల్ల వాటిని వేళ్లతో సహా తొలగించడం కష్టం అమవుతోంది.

భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న సంస్థలు

భారత్ ఎప్పటి నుండో చెబుతున్న ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’ వాదనను ఈ నివేదిక సమర్థించింది. హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు పాక్ గడ్డపై నుంచే భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి. ఈ సంస్థలకు పాక్ ప్రభుత్వం, సైన్యం నుంచి అందుతున్న నైతిక, ఆర్థిక, ఆయుధ సహకారం వల్లనే అవి దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్నాయి.

అంతర్జాతీయ వేదికపై పాక్ ఏకాకి?

అమెరికా వంటి అగ్రరాజ్యం ఇలాంటి నివేదిక ఇవ్వడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగనుంది. ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూడడంలో విఫలమైతే పాక్ మళ్లీ ‘గ్రే లిస్ట్’ లేదా ‘బ్లాక్ లిస్ట్’లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అమెరికా-పాక్ సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఈ నివేదికతో పాక్‌కు అందే ఆర్థిక సాయంపై మరింత ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

అమెరికా కాంగ్రెస్ నివేదిక పాకిస్థాన్ అసలు రంగును ప్రపంచానికి మరోసారి చూపించింది. ఉగ్రవాదానికి అండగా నిలిచే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందలేదని పాక్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభమే ఇందుకు నిదర్శనం. భారత్ శాంతిని కోరుకుంటున్నా, పాక్ గడ్డపై నుంచి సాగుతున్న ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమై పాక్‌పై ఒత్తిడి తెచ్చినప్పుడే ఈ ఉగ్రవాద భూతం అంతమవుతుంది.

Tags:    

Similar News