'ఇరాన్ కోసం పాక్ అణుదాడి చేస్తుంది'... అంతలేదన్న ఇస్లామాబాద్!
పశ్చిమాసియా గత కొన్ని రోజులుగా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.;
పశ్చిమాసియా గత కొన్ని రోజులుగా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఎవరివారు ఏమాత్రం తగ్గేదేలే అంటూ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. పౌర విమానాలకు మూసేసిన గగనతలంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో ఇరాన్ కు మద్దతు ప్రకటించిన అనంతరం ఓ బిగ్ షాక్ ఇచ్చింది పాక్!
అవును... ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు పాకిస్థాన్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పేర్కొంటూ.. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు. అయితే... మొహసిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ తమపై అణుబాంబులను ప్రయోగిస్తే.. వెంటనే పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని, తమపై దాడికి ప్రతీకారంపై ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన ఐ.ఆర్.జీ.సీ. జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యుడు కూడా.
ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహసిన్ రెజాయి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారాయి. ఇరాన్ కోసం పాకిస్థాన్.. అమెరికా మద్దతుతో ఉన్న ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందా? అనే చర్చ ఒక్కసారిగా మొదలైంది. ఈ నేపథ్యంలో పాక్ స్పందించింది.
ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి... మొహసిన్ రెజాయి చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ఇస్లామాబాద్ కు అలాంటి నిబద్ధత ఏమీ లేదని అన్నారు. రెజాయి వాదనను తోసిపుచ్చారు. ఈ సమయంలో ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని.. లేదంటే ఇరాన్, పాలస్తీనా మాదిరిగానే ప్రమాదాలకు అవకాశం ఉందని మాత్రం తెలిపారు.
ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.. ముస్లిం దేశాలు ఇప్పుడు ఏకం కాకపోతే.. ప్రతీ ఒక్కటీ ఫ్యూచర్ లో అలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పాక్ రక్షణ మంత్రి చెప్పినట్లు తుర్కియే టుడే పేర్కొంది. దానర్ధం... ఇరాన్ పై ఇజ్రాయెల్ అణు బాంబులను ప్రయోగిస్తే.. వెంటనే ఇజ్రాయెల్ పై పాకిస్థాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని అర్ధం కాదని అంటున్నారు.