పాక్ సైనికులతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం... సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు!

మరోవైపు పాకిస్థాన్ సెనేటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీవ్రంగా రెచ్చగొట్టే ప్రకటన చేశారు.;

Update: 2025-04-30 13:15 GMT

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాక్ నుంచి పలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతుంది. ఈ సమయంలో పాక్ సెనేటర్ మరో రెచ్చగొట్టే ప్రకటన చేశారు.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ కు భారత్ పలు దౌత్యపరమైన షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు పాకిస్థాన్ సెనేటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీవ్రంగా రెచ్చగొట్టే ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా... అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్థాన్ సైనికులే వేస్తారని ఆమె ప్రకటించారు. ఇదే సమయంలో.. మొదటి అజాన్ ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వయంగా ఇస్తారు అని అన్నారు. అదేవిధంగా... తాము గాజులు ధరించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో సిక్కుల ప్రస్థావన ఆమె తెచ్చారు.

ఇందులో భాగంగా... భారత్ తో వివాదం తలెత్తితే సిక్కు సైనికులు పాకిస్థాన్ పై దాడి చేయరని.. కారణం.. పాకిస్థాన్ వారికి గురునానక్ భూమి అని ఆమె నొక్కి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఎగువ సభలో పాల్వాషా చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

కాగా... పహల్గాం దాడి అనంతరం పాక్ నాయకులు భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇటీవల సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన తర్వాత పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు.

ఓ బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ.. సింధూ జలాలను మళ్లించవద్దని భారత్ ను హెచ్చరించారు. సింధు నాగరికతకు నిజమైన సంరక్షకుడు పాకిస్థాన్ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. సింధూ నదిలో తమ నీరు ప్రవహిస్తుందని.. లేకపోతే భారతీయుల నెత్తురు ప్రవహిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... భారత్ ఏదైనా దాడికి పాల్పడితే ఆ దేశాన్ని తట్టుకునే శక్తి, తిరిగి పోరాడగల సామర్థ్యం పాకిస్థాన్ కు ఉన్నాయని అన్నారు. పహల్గాం ఘటనలోనూ ఆత్మ పరిశీలనకు బదులు మోడీ సర్కార్ పాక్ పై నిందలు మోపుతుందని అన్నారు.

Full View
Tags:    

Similar News