అమెరికా ఆర్మీ డేకు పాక్ ఆర్మీ చీఫ్ కు ఆహ్వానం... అజెండాలో అంశాలివేనా?
అవును... అమెరికా - పాక్ మధ్య సంబంధంపై మరింత చర్చ జరిగేలా ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.;
ఎవరు అవునన్నా.. కాదన్నా.. పాకిస్థాన్ తో అమెరికాకు ప్రపంచానికి కనిపించని రహస్య స్నేహం ఉందనే కామెంట్లు వినిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ తో వణికిపోతున్న పాక్ ను అడ్డుగా వచ్చిన ట్రంప్.. సీజ్ ఫైర్ అంగీకారానికి మధ్యవర్తిత్వం వహించారు! కశ్మీర్ విషయంలోనూ ట్రంప్ ఎంట్రీకి ప్రయత్నించినా.. భారత్ సూటిగా వద్దని చెప్పేసింది.
మరోవైపు... రావల్పిండిలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉందని పాకిస్థాన్ రక్షణ విశ్లేషకుడు ఇంతియాజ్ గుల్ షాకింగ్ విషయం తెరపైకి తెచ్చారు. దీంతో... అమెరికా – పాకిస్థాన్ మధ్య సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సమయంలో మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా - పాక్ మధ్య సంబంధంపై మరింత చర్చ జరిగేలా ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికా ఆర్మీ 150వ వార్షికోత్సవ వేడుకలకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ ను ట్రంప్ నాయకత్వం ఆహ్వానించింది. అదేరోజు (జూన్ 14) ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా కావడంతో మునీర్ వాషింగ్టన్ కు వెళ్లనున్నారు.
దీంతో... అమెరికాలో ట్రంప్ తో జరిగే భేటీలో మునీర్ ప్రస్థావించే అంశాలు ఏమిటీ.. ఏ అజెండాతో అతడు అమెరికా వెళ్లనున్నాడు, ఏ అజెండా మేరకు ట్రంప్ నాయకత్వం పాక్ ఆర్మీ చీఫ్ కి ఆహ్వానం పంపింది అనేది తీవ్ర చర్చనీయాంశం మారింది. ఈ సందర్భంగా... వీరి మధ్య చర్చల్లో కచ్చితంగా ఆపరేషన్ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలు ఉండోచ్చని అంటున్నారు.
ఏప్రిల్ 22న ఇస్లామాబాద్ మద్దతుగల ఉగ్రవాదులు.. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో తుపాకులతో విరుచుకుపడి మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా సైనిక చర్య చేపట్టే ముందు.. ఇరు దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇదే సమయంలో ఈ నది, ఉపనదులపైన ప్రాజెక్టుల ఎత్తు పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు.
అదే జరిగితే... పాకిస్థాన్ గొంతు సీజన్ తో సంబంధం లేకుండా ఎండిపోయే అవకాశం ఉందని, జల విద్యుత్ విషయంలోనూ కష్టాలు తప్పవని అంటున్నారు. దీంతో.. సింధు జలాల ఒప్పందాన్ని పునఃప్రారంభించే అంశంపై భారత్ తో మాట్లాడే విషయంపై అమెరికాను పాక్ రిక్వస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మునీర్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్ లో నిరసనలు!:
మరోవైపు.. మునీర్ అమెరికా పర్యటన పాకిస్థాన్ లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ సందర్భంగా మునీర్ అమెరికా పర్యటనలో.. ఆయనకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నిరసనలకు ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా జూన్ 14న వాషింగ్టన్ లోని పాక్ రాయబార కార్యాలయం వెలువల నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది.