మోదీకి పాక్ 'స్పెషల్' పిలుపు.. టీ కప్పులతో సిద్ధమైన ఇస్లామాబాద్.. అసలు ఆ పిలుపు వెనుక కథ ఏంటి?
త్వరలో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సీఓ) సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ గొప్పగా ప్రకటించుకుంది.
పాకిస్తాన్‌కు మళ్ళీ పాత సరదా గుర్తొచ్చింది. ఇన్నాళ్లూ 'సరిహద్దు ఉగ్రవాదం' అనే ఒకే ఒక్క మంత్రంతో పాక్‌కు ప్రపంచ వేదికలపై చుక్కలు చూపించిన భారత్‌కు ఇప్పుడు స్వయంగా ఆతిథ్యం ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. త్వరలో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సీఓ) సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ గొప్పగా ప్రకటించుకుంది.
పాక్ ఆతిథ్యం ఇస్తాననగానే ఏదో మనసు మారిపోయి పిలుస్తుందని అనుకుంటే పొరపాటే.. ఎస్.సీఓ నిబంధనల ప్రకారం.. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దేశం, సభ్య దేశాలన్నింటినీ తప్పనిసరిగా ఆహ్వానించాలి. అంటే చైనా, రష్యా, భారత్ వంటి దేశాల పేర్ల పక్కన మోదీ గారి పేరు కూడా "రూల్ ప్రకారం" రాయాల్సి వచ్చిందన్నమాట. "నాన్-వెజ్ తినిపిస్తాం రండి" అని శాఖాహారిని హోటల్‌కు పిలిచిన చందంగా ఉంది ఈ పాక్ ముచ్చట..
ఇంతకీ మోదీ ఇస్లామాబాద్ విమానం ఎక్కుతారా? ఈ ప్రశ్నకు సమాధానం ఐదేళ్ల బాబును అడిగినా చెప్తాడు. "ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాగవు" అని భారత్ ఇప్పటికే వందసార్లు తెగేసి చెప్పింది. పహల్గామ్ దాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్నే మోదీ సర్కార్ 'హోల్డ్'లో పెట్టింది. నీళ్లే ఇవ్వనిది.. ఇప్పుడు నేరుగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టి బిర్యానీ తింటారని ఆశపడటం పాక్ దౌత్యవేత్తల అమాయకత్వానికి పరాకాష్ట..
గతంలో అంటే 2024లో ఎస్.సీఓ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్లొచ్చారు. ఆయన వెళ్లడమే కాకుండా అక్కడే ఉంటూ పాక్ నెత్తిపై దౌత్యపరమైన 'సర్జికల్ స్ట్రైక్స్' చేసి వచ్చారు. కానీ ప్రధాని స్థాయి పర్యటన అంటే అది వేరే లెక్క. ఉగ్రవాద స్థావరాలను నడుపుతూ ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతున్న దేశానికి మోదీ వెళ్లడం పక్కన పెడితే.. అసలు ఆ ఆహ్వాన పత్రాన్ని పిఎంఓ సైడ్ టేబుల్ మీదైనా ఉంచుతారో లేదో చూడాలి..
మొత్తానికి పాకిస్తాన్ తన బాధ్యత నెరవేర్చామని చెప్పుకోవడానికి ఆహ్వాన పత్రికలు ముద్రించి పంపుతోంది. కానీ భారత్ నుంచి 'నో థాంక్స్' అనే సమాధానం వెళ్లడానికీ లేదా మరోసారి జైశంకర్ లాంటి గట్టి నాయకుడిని పంపి ఇస్లామాబాద్‌లోనే ఉగ్రవాదంపై క్లాస్ పీకడానికీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉగ్ర రాజధానికి మోదీ వెళ్లడం అనేది ప్రస్తుతానికి పాకిస్తాన్ రాత్రిపూట కనే పగటి కలే..