పాక్-ఇరాన్ కొత్త స్నేహం.. చేతులు కలిపిన బద్ధశత్రువులు.. భారత్‌పై దాని ప్రభావం ఎంత?

పాకిస్థాన్, ఇరాన్ రెండు దేశాలు ప్రస్తుతం దాదాపు ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.;

Update: 2025-05-27 18:51 GMT

గతేడాది ఒకరిపై ఒకరు బాంబులు వేసుకున్న దాయాది దేశం పాకిస్థాన్, ఇరాన్ ఇప్పుడు తిరిగి చేతులు కలుపుతున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటన తర్వాత ఈ పరిణామాలు మరింత స్పష్టమయ్యాయి. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను దౌత్యపరంగా ఒంటరి చేయాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఇరాన్‌తో ఈ కొత్త బంధం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఒకరిపై ఒకరు అనుమానంగా చూసుకునే ఈ రెండు దేశాలు ఎందుకు ఒక్కటవుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం.

పాకిస్థాన్, ఇరాన్ రెండు దేశాలు ప్రస్తుతం దాదాపు ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇది ఇరాన్ మద్దతు ఉన్న హమాస్‌కు బలహీనమైన కోట. మరోవైపు ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర ఆందోళన చెంది, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. ఇది దాదాపు అరగంటలోపే సక్సెస్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు ముస్లిం దేశాలు తమ శత్రువులను ఎదుర్కోవడానికి దౌత్యపరంగా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇది వారి మధ్య శత్రుత్వాన్ని వదిలి మళ్లీ చేతులు కలపడానికి ప్రేరణగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పహల్గాం దాడి తర్వాత భారత్, ఇరాన్, పాకిస్థాన్‌లలోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ప్రతిదాడికి ఈ రెండు దేశాలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ఈ మధ్య పాకిస్థాన్‌ను పరోక్షంగా సమర్థిస్తూ, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ సూచించింది. ఇది కూడా రెండు దేశాల మధ్య స్నేహం మళ్లీ చిగురించడానికి ఓ కారణం కావచ్చు.

షెహబాజ్ షరీఫ్, ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్', పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ శాంతియుత చర్చల ద్వారా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, అయితే భారత్ కూడా దీనికి అంగీకరించాలని అన్నారు.

తర్వాత ఖమేనీ 'ఎక్స్'లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య విభేదాలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ ఇప్పటికే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే, భారత్ తన వైఖరిని మార్చుకుంటూ కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక సమస్య అని, ఇందులో ఏ మూడవ పక్షం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. పశ్చిమ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోలేదు. కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినా, పాకిస్థాన్ మాత్రం పాలస్తీనియన్లకు మద్దతునిచ్చింది. ఇది కూడా రెండు దేశాల మధ్య స్నేహానికి ఒక కారణం.

గతేడాది ఇరాన్, పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న జైష్ అల్-ఆదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ దాడులు చేసింది. ఈ ఉగ్రవాద సంస్థ ఇరాన్‌లోని సిస్తాన్, బలూచిస్థాన్ ప్రాంతాల స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. ఇరాన్ చేసిన ఈ దాడుల్లో అమాయక పాకిస్థాన్ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన పాకిస్థాన్, ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను అమాంతం పెంచింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని సంవత్సరం తర్వాత తెహ్రాన్ పర్యటించడం, ఆ దేశంతో బలపడుతున్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి.

ఖమేనీ తన 'ఎక్స్' ఖాతాలో ఇరాన్, పాకిస్థాన్ సంబంధాలను ఒక వేదికగా అభివర్ణించారు. రెండు దేశాలు సోదర దేశాలని, చిన్న చిన్న గొడవలు సహజమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో ముస్లిం దేశాల మధ్య ఐక్యత ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్, ఇరాన్ చేతులు కలుపుతున్నప్పటికీ భారత్ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇరాన్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే మే 9 తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో 20వ భారత్-ఇరాన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, ఈ లక్ష్యాన్ని సాధించడానికి పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు.

Tags:    

Similar News