‘చీకటి గదే మేలు’... మునీర్ పై ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్!
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.;
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో... 2023 ఆగస్టు నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చుక్కెదురు అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు.. ఆర్మీ చీఫ్ మునీర్ అరాచకాలపై ఎక్స్ వేదికగా స్పందించారు!
అవును... పాకిస్థాన్ లో ప్రజలు మునీర్ అనధికారిక నిరంకుశ పాలనలో మగ్గిపోతున్నరనే విమర్శలు ఇటీవల కాలంలో తీవ్రంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఇటీవల పార్లమెంటులో చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ‘ఎక్స్’ లో స్పందించారు. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం పైనా, మునీర్ పైనా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... ఇటీవల చేసిన ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ.. 'ఓటుహక్కు, చట్టబద్ధ పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా'.. వీటన్నింటినీ నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా... జులై 6 తర్వాత ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
ఈ మేరకు దేశం మొత్తానికి ముఖ్యంగా పీటీఐ కార్యకర్తలకు, మద్దతుదారులకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే జైల్లో చీకటి గదిలోనే జీవించడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్నివిధాలా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా... పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఇమ్రాన్ ఖాన్... ఓ నియంత అధికారంలోకి వస్తే.. అతడికి ఓట్లు అవసరం లేదని, ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని విమర్శించారు. కోర్టుల్లో 'ఎంపిక చేసిన' న్యాయమూర్తులే ఉంటున్నారని.. స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగా మారిపోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో... దేశంలో వాక్ స్వాతంత్ర్యం పూర్తిగా కనుమరుగవుతోందని.. నిజాయతీ గల జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. ఈయన పిలుపు మేరకు పాక్ లో 6వ తేదీన నిరసనలు ఏ స్థాయిలో జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.