ఎవరీ పాకా...ఏమా బీజేపీ ఎంపిక ?
మరి బీజేపీ ఎంపిక చేసిన పాకా వెంకట సత్యనారాయణ ఎవరు, ఎందుకు ఆయన పేరుని పార్టీ ఎనుకుంది అన్నది అంతా చర్చిస్తున్నారు.;
బీజేపీ ఎంపికలు ఎపుడూ చిత్ర విచిత్రంగా ఉంటాయి. 2024లో అనూహ్యంగా కేంద్ర మంత్రిగా నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మను చేసిన బీజేపీ అధినాయకత్వం ఈ మధ్యనే సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా కూడా చేసింది ఇక తాజాగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు పాకా వెంకట సత్యనారాయణను నామినేట్ చేసి మిత్ర పక్షాలతో సహా రాజకీయ పక్షాలను పూర్తిగా ఆశ్చర్యపరచింది.
మరి బీజేపీ ఎంపిక చేసిన పాకా వెంకట సత్యనారాయణ ఎవరు, ఎందుకు ఆయన పేరుని పార్టీ ఎనుకుంది అన్నది అంతా చర్చిస్తున్నారు. ఆయన గురించి అదే పైగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు కూడా. కూటమికి దక్కిన రాజ్యసభ సీటుకు ఎందరో పోటీ పడ్డారు కానీ పాకాకే ఓటు వేయడానికి గల కారణాలు ఏమిటి అంటే ఆయన పార్టీకి వీర విధేయుడిగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ పోవడమే రీజన్ అని అంటున్నారు.
అంతే కాదు ఆయనది ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్, ఏబీవీపీ నేపథ్యం. 45 ఏళ్ళ బీజేపీతో అసోసియేషన్ బీసీ సామాజిక వర్గం వివాద రహిత జీవితం ఇవన్నీ కలసే ఈ ఉన్నత పదవిని వరించి వచ్చేలా చేశాయని అంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన పాకా వెంకట సత్యనారాయణ భీమవరం మునిసిపాలిటీకి కౌన్సిలర్ గా మాత్రమే నాలుగు సార్లు గెలిచారు.
ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక్కసారి కూడా గెలిచినది లేదు అని అంటున్నారు. అంతే కాదు పార్టీ కూడా ఆయనకు పోటీ చేసేందుకు ఒకే ఒకసారి టికెట్ ఇచ్చింది. 1996లో బీజేపీ తరఫున పాకా వెంకట సత్యనారాయణ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీకి చెందిన అప్పటి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలిచారు. ఆయనకు మూడు లక్షల నాలుగు వేల 536 ఓట్లు వచ్చాయి.
ఇక కాంగ్రెస్ నుంచి పోటీ పడిన కనుమూరి బాపిరాజుకు రెండు లక్షల 86 వేల 910 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేసిన కలిదిండి కృష్ణం రాజుకు లక్షా 7 వేల 557 ఓట్లు లభించాయి. ఇక నాలుగవ స్థానంలో ఉన్న పాకా వెంకట సత్యనారాయణకు అక్షరాలా మూడు వేల 964 ఓట్లు లభించాయి.
ఈ ఎన్నికల్లో 0.56 శాతం ఓటు షేర్ ని సాధించి డిపాజిట్లు కోల్పోయిన పాకా మళ్ళీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే పార్టీ పదవులు మాత్రం ఆయనకు దక్కాయి. అందుకే ఆయన గత నాలుగేళ్ళుగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ఆయన లోక్ సభకు పోటీ చేసిన సరిగ్గా 29 ఏళ్ళ తరువాత అదృష్టం వరించి వచ్చింది.
అందుకే రాజ్యసభ సీటు ఆయన సొంతం అయింది అని అంటున్నారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ళ పాటు కొనసాగుతారని అంటున్నారు. మరి ఆయనకు ఈ పదవి ఇవ్వడంలో బీజేపీ వ్యూహం ఏమిటి అంటే కష్టపడే వారికి పార్టీని అట్టిపెట్టుకునే వారికీ ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని బలమైన సందేశాన్ని ఇవ్వడమే అని అంటున్నారు.
నిజానికి పాకా వెంకట సత్యనారాయణకు ఈ పదవి ఇవ్వడం వల్ల గోదావరి జిల్లాలలో బీజేపీ బలం ఏమీ పెరగదు. అనూహ్యంగా పార్టీ ఎదిగేది కూడా ఉండదు. రాజ్యసభలో బలం మరో సీటుకు పెరుగుతుంది. కానీ బీజేపీ నమ్ముకున్న వారిని ఆదరిస్తుంది అన్నది తెలియచేయడం కోసమే ఇలా చేసింది అని అంటున్నారు.
ఇక ఈ పదవి కోసం బీజేపీలో ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. కానీ వారిని కాదని పాకాను ఎంచుకోవడంలోనే బీజేపీ మార్క్ ఉంది. వలస నేతలను తీసుకుంటాం, కానీ న్యాయం చేసే విషయంలో తొలి ప్రయారిటీ ఎపుడూ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే అని స్పష్టం చేసినట్లు అయింది అని అంటున్నారు.