పద్మాలు విరబూయని చోటు-జీవిత కాలం లేటు
ధర్మేంద్ర విషయానికి వస్తే యాభై దశాబ్దం చివరి నుంచి సినీ రంగంలో ఉంటూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన సమర్థతకు ఏనాడో పద్మ విభూషణ్ దక్కాల్సి ఉంది. కానీ పద్మ భూషణ్ వద్దనే ఆగిపోయారు.;
పద్మ పురస్కారాలు గొప్ప గౌరవంగా అంతా భావిస్తారు. ఇవి పౌర పురస్కారాలుగా ఉంటాయి. అంటే మొత్తం 144 కోట్ల మంది ప్రజానీకం ప్రతిభావంతులు ఆయా రంగాలలో చేసిన సేవలను గుర్తించి పద్మ అవార్డులను ఇచ్చినట్లుగా అభిప్రాయపడతారు. ఇక ఈసారి పద్మ పురస్కారాలలో కొన్ని విశేషాలు కనిపించాయి. ఉత్తరాదిన చూస్తే లెజెండరీ యాక్టర్ నిన్నటి దాకా జీవించి మన మధ్యనే ఉన్న ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఇది దేశంలో రెండో అత్యున్నత పురస్కారం. అయితే చాలా మందికి ఇవి జీవించి ఉన్నపుడు దక్కకపోవడం అత్యంత బాధాకరం.
తొంబై వయసు దాకా :
ధర్మేంద్ర విషయానికి వస్తే యాభై దశాబ్దం చివరి నుంచి సినీ రంగంలో ఉంటూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన సమర్థతకు ఏనాడో పద్మ విభూషణ్ దక్కాల్సి ఉంది. కానీ పద్మ భూషణ్ వద్దనే ఆగిపోయారు. దాదాపుగా తొంబై ఏళ్ల దాకా జీవించిన ఈ లెజెండరీ యాక్టర్ కి మరణించిన తరువాత ఈ పద్మం దక్కడం ఒకింత బాధగా ఉంది. అయినా సరే ఆయన అభిమానులకు దక్కిన ఒక ఆనందంగా చూస్తున్నారు. తెలుగు నాట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలో ఇలాగే జరిగింది. ఆయన 2020 సెప్టెంబర్ 25న కరోనాతో మరణించారు. 2021లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. బాలూకి పద్మశ్రీ అవార్డు కూడా లేట్ గా వచ్చింది. ఆ తరువాత రెండు దశాబ్దాలకు పద్మభూషణ్ ఇచ్చారు. పద్మ విభూషణ్ కి అర్హుడుగా ఉన్నా ఆయన జీవిత కాలంలో చూడలేకపోయారు.
ముమ్ముట్టి ఎట్టకేలకు :
ఇక దక్షిణాదిన అద్భుతమైన నటుడిగా ముమ్ముటి ఉన్నారు. ఆయన మళయాళం చిత్ర సీమకు చెందిన లెజెండరీ యాక్టర్. ఏడున్నర పదుల వయసులో ఉన్న ఆయన సినీ జీవితం అర్ధ శతాబ్దం పై దాటింది. ఆయన కంటే ముందే ఎంతో మందికి పద్మ భూషణ్ లే కాదు పద్మ విభూషణ్ లు కూడా దక్కాయి. మొత్తానికి ఎట్టకేలకు మమ్ముట్టికి పద్మ భూషణ్ దక్కింది. ఇది అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. అయితే విశ్వనటుడు కమల్ హాసన్ సినీ జీవితం వయసు అక్షరాలా ఆరు దశాబ్దాల పై మాటగానే ఉంది. కానీ ఆయనకు ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన పద్మశ్రీ తప్ప మళ్లీ పౌర పురస్కారం లభించలేదు. దాంతో ఆయన ప్రతిభకు పద్మ పురస్కారం ఎపుడు దక్కుతుందో అన్నది అభిమానుల ఆవేదనగా ఉంది.
ఎంతో మందికి అందనిది :
తెలుగు సినీ సీమలో తీసుకుంటే మూడేళ్ళ క్రితం గతించిన విలక్షణ నటుడు చంద్రమోహన్ కి పద్మ పురస్కారం దక్కలేదు అన్న బాధ ఎంతో మందికి ఉంది. అలాగే బాపు, కె విశ్వనాధ్ వంటి ఉద్ధండులకు కేవలం పద్మశ్రీలు మాత్రమే లభించాయి. దిగ్దర్శకుడు దాసరి నారాయణరావుకు పద్మ పురస్కారమే లభించలేదు. అంతే కాదు ప్రస్తుతం తీసుకుంటే ఈ మధ్యనే కేరళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం బహుభాషా నటీమణిగా శారదకు ప్రకటించింది. ఊర్వశి జాతీయ అవార్డుని డెబ్బై దశకంలో మూడు సార్లు అందుకుని వందల చిత్రాలలో నటించిన ఆమెకు ఇప్పటిదాకా పద్మ పురస్కారం లభించకపోవడం బాధాకరమే అని అంటారు. అలాగే యాభై ఏళ్ళ సినీ చరిత్రను పూర్తి చేసుకున్న సహజ నటి జయసుధకు పద్మ అవార్డు దక్కలేదు, అలాగే టాలీవుడ్ బాలీవుడ్ లో తన అసమాన ప్రతిభను చూపించి వందల చిత్రాలలో నటించిన జయప్రదకు అలనాటి నటీమణి వాణిశ్రీకి కూడా పద్మ పురస్కారాలు లభించలేదు అన్న అసంతృప్తి అయితే అభిమానులలో ఉంది.