ఉస్మానియాలో ర్యాగింగ్.. పీజీ విద్యార్థి సూసైడ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా వైద్య కళాశాలగా పేరున్న ఉస్మానియా ఆసుపత్రిలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా వైద్య కళాశాలగా పేరున్న ఉస్మానియా ఆసుపత్రిలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. తాజాగా జనరల్ సర్జరీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి డాక్టర్ సురేష్ నిద్రమాత్రమలు మింగి.. మత్తు ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల వేధింపులతోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లుగా సురేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల్ని చూస్తే..
జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెందిన 29 ఏళ్ల డాక్టర్ సురేష్ నాయక్.. ఇటీవల ఉస్మానియాలో పీజీ మొదటి సంవత్సరంలో చేరారు. మూడు నెలలుగా ఉస్మానియా ఆసుపత్రిలోని పీజీ క్యార్టర్స్ లో ఉంటున్నాడు. తన సీనియర్ వైద్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు తల్లి నాగమణికి ఫోన్ లో చెప్పి సురేష్ వాపోయేవాడు. పీజీ సీటును రిజర్వేషన్ కారణంగా సులువుగా వచ్చిందంటూ ర్యాంగింగ్ చేస్తుండేవారు. ఈవిషయాల్ని తల్లికి చెప్పి బాధపడేవాడు.
ఈ నేపథ్యంలో సురేశ్ తల్లి నాగమణి తన సోదరుడ్ని పంపి.. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.తాను సీనియర్ల వద్దకు వెళ్లి మాట్లాడతానని చెప్పగా..సురేష్ వారిస్తూ అలా చేయొద్దని.. తనను మరింత టార్గెట్ చేస్తారని చెప్పి.. తాను హ్యాండిల్ చేస్తానని చెప్పి మేనమామను తిరిగి పంపించేశాడు. అదే సమయంలో తల్లికి ఫోన్ చేసి మేనమామను మళ్లీ తన వద్దకు పంపొద్దని ప్రాధేయపడ్డాడు.
గురువారం ఉదయం ఏడున్నర గంటలకు డ్యూటీకి వెళుతున్నట్లుగా చెప్పిన సురేష్.. తొమ్మిది గంటలు అవుతున్నా రూం నుంచి బయటకు రాకపోవటంతో.. సహచర వైద్య విద్యార్థిని డాక్టర్ అమూల్య సురేష్ గదిలోకివెళ్లి చూడగా.. అతని చుట్టూ నిద్ర మాత్రలు.. చేతికి ఇంజక్షన్ తీసుకున్నట్లుగా గుర్తించి.. ఇతర విద్యార్థులకు సమాచారం అందించారు. వెంటనే.. అతడ్ని అత్యవసర విభాగానికి తరలించి చికిత్స చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సురేష్ ఆత్మహత్యకు సీనియర్ వైద్యులే కారణమని.. వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పీజీ వరకు వచ్చిన ఒక వైద్యుడు తోటి వారి వేధింపులకు బలి కావటం విషాదకరంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.