సింధూర్ వేళ భారత్ తీరు చెప్పి ట్రంప్ గాలి తీసిన పాక్ మంత్రి

ఆపరేషన్ సింధూర్ వేళ.. మూడో వ్యక్తి ప్రస్తావనకు భారత్ ససేమిరా అన్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పాక్ విదేశాంగ మంత్రి మాటల్లో స్పష్టమైంది;

Update: 2025-09-17 05:56 GMT

నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. ఇప్పుడు ఆ మాట నిజమని మరోసారి రుజువైంది. ఆపరేషన్ సింధూర్ వేళ.. మూడో వ్యక్తి ప్రస్తావనకు భారత్ ససేమిరా అన్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పాక్ విదేశాంగ మంత్రి మాటల్లో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ వేళ.. భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తల్ని తానే పరిష్కరించానని.. తానే యుద్ధాన్ని ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకునే మాటల్లో నిజం లేదని స్పష్టమైంది. ఇరు దేశాల కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏమీ లేదన్న విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రి చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి.

కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఏ మాత్రం అంగీకరించలేదని తేల్చిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ‘కీలక అంశాలపై పొరుగుదేశంతో చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ.. మాతో చర్చలపై భారత్ స్పందించటం లేదు’’ అని స్పష్టం చేశారు. అల్ జజీరా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘రెండు దేశాల వ్యవారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించానని.. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరాం. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోవటం లేదని మాతో ఆయన చెప్పారు’ అని చెప్పటం ద్వారా ట్రంప్ ఇప్పటివరకు చెప్పిన మాటలనని అసత్యాలుగా తేలిపోయాయి.

కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ అమెరికా నుంచి మే 10న ఆఫర్ వచ్చిందని.. ఒక తటస్థ వేదికపై అతి త్వరలో చర్చలు మొదలు పెడదామని మార్కో రూబియో తమకు చెప్పినట్లుగా పేర్కొన్నారు. కానీ.. అలాంటి చర్చలు ఏమీ జరగలేదన్న ఆయన.. జులై 25న వాషింగ్టన్ లో జరిగిన భేటీలో రూబియోను కలిశానని.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఏర్పాటు చేస్తానన్న మీటింగ్ ఎందుకు జరగలేదన్న విషయాన్ని తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కో రూబియో తనతో చెప్పిన మాటల్ని పాక్ మంత్రి బయటపెట్టారు. ‘‘ఆది ద్వైపాక్షిక అంశం. మూడో పక్షం జోక్యాన్ని అనుమతించమని భారత్ తేల్చి చెప్పింది. అందుకే సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. భారత్ ఇలా చెబుతున్నప్పుడు మేం ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భార్ ను అడుక్కోలేం కదా?’’ అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశారు.

ఈ సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తమది శాంతిని కోరుకునే దేశంగా పేర్కొన్న ఆయన.. ‘చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తాము విశ్వసిస్తామన్నారు. అందుకు రెండు దేశాలు ముందుకు రావాలి. చర్చలకు భారత్ ఒప్పుకుంటే మేం కూడా సిద్ధంగా ఉన్నాం. థర్డ్ పార్టీని అనుమతించాలని మేము కూడా పట్టుబట్టటం లేదు. వాణిజ్యం.. ఆర్థికం.. జమ్ముకశ్మీర్తదితర అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం’ అంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మూడో పక్షం జోక్యం విషయంలో భారత్ ఎంత కఠినంగా ఉంటుందన్నది స్పష్టమవుతుంది.

అదే సమయంలో భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణలో తాను కీలక భూమిక పోషించినట్లుగా తనకు తాను క్రెడిట్ ఇచ్చుకున్న అమెరికా అధ్యక్షుడి మాటల్లోని డొల్లతనాన్ని పాక్ విదేశాంగ మంత్రి బయటపెట్టినట్లుగా చెప్పాలి. మొత్తంగా పాక్ విదేశాంగ మంత్రి మాటలతో ట్రంప్ అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఆయన గాలి తీశారని చెప్పక తప్పదు. పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ వ్యవహరించిన తీరు స్పష్టమవుతుందని చెప్పాలి.

Tags:    

Similar News