ట్రంప్ ‘కశ్మీర్’ ఆశకు తలుపులు మూసేసిన మోడీ
పహల్గాం ఉగ్రదాడి.. దానికి కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి.;
పహల్గాం ఉగ్రదాడి.. దానికి కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ నోటి నుంచి వచ్చే కశ్మీర్ మాటకు బదులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ అనే పదం బలంగా బయటకు రావటమే కాదు.. ఆ దేశంతో రెండు విషయాల మీద మాత్రమే చర్చలు జరుపుతామని.. అందులో మొదటిది ఉగ్రవాదం.. రెండోది.. పాక్ అక్రమిత కశ్మీర్ అని స్పష్టంగా తేల్చేశారు.
దీంతో.. కశ్మీర్ అంశం గురించి మాట్లాడటానికి ఏమీ లేదన్న సందేశాన్ని ఇవ్వటమే కాదు.. దాని ప్రస్తావన చేయటాన్ని కూడా తాము అంగీకరించమన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చెప్పేశారు. కశ్మీర్ ప్రస్తావన తేవటం భారత్ కు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు మిగిలిన వారి కంటే ఎక్కువగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆశనిపాతంలా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ట్రంప్ ఎంతలా తపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇష్టాన్ని ఆయన దాచుకోలేదు కూడా. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రస్తావిస్తూనే ఉన్నారు.
భారత్.. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గటంలో తానే కీలకభూమిక పోషించానని.. అణుయుద్ధాన్ని ఆపానని.. రెండు దేశాలు తాను చెప్పినట్లు వినకుంటే వాణిజ్యాన్ని ఆపేస్తానని చెప్పినట్లుగా ట్రంప్ స్వయంగా చెప్పుకున్నారు. ఆయన మాటల్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే. సాధారణంగా రెండు దేశాలకు సంబంధించి మరో దేశం మాట్లాడేటప్పుడు.. అందునా భారత్ లాంటి పెద్ద దేశం గురించి వ్యాఖ్యలు చేసే వేళలో.. తాను కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని ట్రంప్ పట్టించుకోలేదు.
ట్రంప్ మాదిరి మాటల్ని విసిరేసే విధానాన్ని భారత పాలకులకు మొదట్నించి అలవాటు లేదు. ఎవరైనా తొందరపాటుతో మాట్లాడితే కాస్త ఓపికతో.. సహనంతో చూసే తీరు మొదట్నించి ఉంది. ఇదే.. ట్రంప్ నకు శ్రీరామరక్షగా మారింది. అయితే..ఇక్కడ నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పాలి. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. ఆయన పెట్టిన పోస్టుల కారణంగా మోడీ ఇమేజ్ ఎంతలా దెబ్బ తీసిందో తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే.. అనూహ్య రీతిలో బయటకు రాలేని బంధనంలో మోడీ చిక్కుకుపోయినట్లుగా పరిస్థితి కనిపించింది.
ఇలాంటి వేళలో.. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఒక అవకాశంగా మలుచుకున్న మోడీ.. తన భావాన్ని.. అభిప్రాయాన్ని బలంగా.. సూటిగా చెప్పేశారు. పాకిస్తాన్ తో చర్చలు అంటే.. ఏదేదో అనుకునేరు. కేవలం రెండు అంశాల్లోనే ఆ దేశంతో చర్చలు జరుపుతామని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం రెండు దేశాల మీద మధ్యవర్తిత్వం చేయాలంటే అయితే ఉగ్రవాదం అంతం మీదా.. రెండోది పాక్ అక్రమిత కశ్మీర్ మీదా.
ఈ రెండు విషయాల్ని టచ్ చేసే కన్నా.. తన వ్యాపారాన్ని తాను చేసుకోవటానికే ట్రంప్ మొగ్గు చూపుతారు. తన చిన్నపాటి ప్రసంగంతో మోడీ చాలానే చేశారు. అన్నింటికి మించి ట్రంప్ ‘కశ్మీర్’కలను కూల్చేయటమే కాదు..మరెప్పటికి మాట్లాడలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకవేళ తెగించి మరీ.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తే? అన్న సందేహం రావొచ్చు, అలాంటిదే జరిగితే.. తమకు ఆ విషయంలో ఎలాంటి ఆసక్తి ఉండదన్న విషయాన్ని మోడీ కుండబద్ధలు కొట్టేశారు. ఇక.. ట్రంప్ మాత్రం ఏం చేయగలరు?