మరోసారి ఉలిక్కిపడ్డ పాక్... లాహోర్ లో భారీ పేలుళ్లు!
అవును... భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను వణికించిన ఒకరోజు తర్వాత పాకిస్థాన్ లో మరోసారి పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.;
ఏప్రిల్ 22న 26 మందిని బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంగళవారం రాత్రి 1:05 నుంచి 1:30 మధ్య సుమారు 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్ర శిబిరాలపై భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 80మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు చెబుతున్నారు.
భారత సైన్యం చేపట్టిన ఈ దాడుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలతోపాటు, పాకిస్థాన్ లోని పంజాబ్ లో గల ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం గమనార్హం. ఈ దాడి ఉగ్రమూకలకు అతిపెద్ద ఎదురుదెబ్బగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో తాజాగా లాహోర్ లో మరోసారి భారీ పేలుళ్లు వినిపించాయి.
అవును... భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను వణికించిన ఒకరోజు తర్వాత పాకిస్థాన్ లో మరోసారి పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఇందులో భాగంగా... పాకిస్థాన్ లోని లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. అనంతరం సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ సమయంలో లాహోర్ విమానాశ్రయం సమీపంలోని లోని గోపాల్ నగర, నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఈ సమయంలో పెద్ద ఎత్తున పొగ మేఘాలు కమ్ముకున్నాయని.. పేలుళ్ల శబ్ధాలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారని మీడియా నివేదించింది.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసు వర్గాలు.. 5 నుంచి 6 అడుగుల పొడవున్న డ్రోన్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని తెలిపాయి. పేలుళ్ల శబ్ధాలు వినిపించిన రోడ్డు నేరుగా లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ కు వెళ్తుందని నివేదికలు తెలిపాయి!