పాక్ ప్రధాని సంచలనం.. 7 భారత జెట్లను స్క్రాప్ గా మార్చేశాం
అత్యుత్తమ స్థానాల్లో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.;
అత్యుత్తమ స్థానాల్లో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే... అలాంటిదేమీ లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో పాక్ ప్రధాని సైతం తీసిపోరన్న విషయం తాజాగా తేలింది. ఆపరేషన్ సింధూర్ వేళ.. భారత్ తో కాళ్లబేరానికి వచ్చిన పాకిస్థాన ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతోంది. పాక్ ప్రధాని స్వయంగా ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్ ను రెచ్చగొట్టటమే లక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ వేళ.. భారత వైమానిక దాడులకు చేష్టలుడిగి.. కాళ్ల బేరానికి వచ్చిన పాక.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తోంది. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తో జరిగిన మిలిటరీ ఘర్షణల్లో పాక్ ఫైటర్ జెట్ లు గర్జించి.. భారత్ కు చెందిన ఏడు జెట్లను స్క్రాప్ గా మార్చేసినట్లుగా వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తమ దేశ పైలట్లను ఫాల్కన్స్ గా పాక్ ప్రధాని అభివర్ణించారు. ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాల్ని తీసుకెళ్లి భారత విమానాల్ని తమ పైలెట్లు ధ్వంసం చేసినట్లుగా చెప్పుకున్నారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్ నుంచి ఎలాంటి కారణాలు లేకుండానే తమ దేశంపై దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మరక్షణ కోసం తాము స్పందించినట్లుగా చెప్పారు.
అయితే.. ఇక్కడో సందేహం ఉంది. పాక్ ప్రధాని నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యలకు.. ఇప్పటివరకు ఇదే అంశం మీద పాక్ మీడియాలో పబ్లిష్ అయిన కథనాల ప్రకారం చూస్తే.. బారత్ కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను తాము కూల్చినట్లుగా పాక్ ఇప్పటికే పేర్కొంది. తాజాగా పాక్ ప్రధాని మాత్రం ఏడు భారత జెట్లను కూల్చేసినట్లుగా వ్యాఖ్యానించటం ద్వారా దాయాది దేశం తాను చెప్పిన మాటల్ని తానే ఖండించినట్లైంది.
పాక్ ప్రధాని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ కోల్పోయిన ఫైటర్ జెట్స్ ఎన్ని? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన భారత్.. తాజాగా మాత్రం అలా వ్యవహరించకూడదనే చెప్పాలి. పాక్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించటంతో పాటు.. పాక్ హడావుడి మొత్తం మాటల్లోనే తప్పించి.. చేతల్లో ఏమీ లేదన్న విషయాన్ని మరిన్ని ఆధారాలతో సహా నిరూపించాల్సిన అవసరం ఉంది.
ఆపరేషన్ సిందూర్ వేళ పాక్ సైనికాధికారులు లైన్లోకి వచ్చి.. కేంద్రంలోని మోడీ సర్కారును కాల్పుల విరమణ కోసం తపించిన వైనం తెలిసిందే. ఇటీవల కాలంలోనూ పాక్ సైనికాధికారుల వినతి మేరకే కాల్పుల విరమణ అంగీకారం చేసినట్లుగా భారతదేశం పదే పదే అదే అంశాన్ని స్పష్టం చేయాల్సి వస్తోంది.
ఇలాంటి రచ్చకు చెక్ చెబుతూ.. అందుకు అవసరమైన పర్మినెంట్ సొల్యూషన్ గురించి భారత్ ఆలోచించాల్సిన అవసరం ఉంది పాక్ మాట్లాడినప్పుడు కౌంటర్ దాడి చేసేందుకు వీలుగా వ్యవస్థను సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారు మీద ఉందన్నది మర్చిపోకూడదు.పాక్ ప్రధాని నోరు పారేసుకున్న వేళ.. భారత్ తన వాదనను ఎప్పుడు.. ఎలా వినిపిస్తుందో చూడాలి.