జమ్మూకశ్మీర్ లో 'ఆపరేషన్ మహదేవ్‌'.. పహల్గాం దాడి ఉగ్రవాదులు హతం!

ఆవును... శ్రీనగర్‌ లోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.;

Update: 2025-07-28 11:26 GMT

పహల్గాం ఉగ్రదాడికి అనంతరం సరిహద్దుల్లో భారత్ అణువణువూ జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో రెగ్యులర్ గా కూంబింగ్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్‌ లో భీకర ఎన్‌ కౌంటర్‌ జరుగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా.. వారు పహల్గాం దాడికి పాల్పడినవారని వెల్లడైంది!

ఆవును... శ్రీనగర్‌ లోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌ లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెబుతుండగా... వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులనే వివిషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్‌ ఇండియా రేడియో వెబ్‌ సైట్‌ లో వెల్లడించింది.

వాస్తవానికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా 'ఆపరేషన్‌ మహదేవ్‌' చేపట్టింది. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం రావడంతో సుమారు నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం శ్రీనగర్‌ లోని లిద్వాస్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహాదేవ్ సమీపంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది!

ఈ సమయంలో... ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు! ఈ సందర్భంగా... మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందినవారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాగి ఉన్న ప్రదేశం నుండి అనేక గ్రెనేడ్లు, రేషన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమమంలో... ఎన్‌ కౌంటర్‌ లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రతీక్‌ శర్మ అభినందించారు. జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్... జబర్వాన్, మహాదేవ్ శిఖరాల మధ్య జరిగినందున "ఆపరేషన్ మహాదేవ్" అని పేరు పెట్టి ఉండొచ్చని అంటున్నారు.

కాగా... ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌ లోని పహల్గాంలో గల బైసరన్‌ లోయ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అక్కడినుంచి సమీపంలోని అటవీప్రాంతం గుండా పరారయ్యారు!

అప్పటినుంచి భారత భద్రతా దళాలు ఈ ముష్కరుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలో... లష్కరే తయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఈ మారణహోమానికి పాల్పడిన ఉగ్రమూకలో ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షల వరకు రివార్డును ప్రకటించారు.

Tags:    

Similar News