మరో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి

ఒహాయో రాష్ట్రంలోని హౌలాండ్ టౌన్షిప్‌ సమీపంలో ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు.;

Update: 2025-06-30 18:44 GMT

అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒహాయో రాష్ట్రంలోని హౌలాండ్ టౌన్షిప్‌ సమీపంలో ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సెస్నా 441 మోడల్‌కు చెందిన ఈ విమానం ఆదివారం ఉదయం యంగ్‌జీన్-వారెన్ రీజినల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది.

గమ్యస్థలంగా మోంటానాలోని బోజ్‌మాన్‌ కు చేరుకోవాల్సిన విమానం, టేక్‌ ఆఫ్‌ చేసిన కేవలం ఏడు నిమిషాలకే అడవిలో కుప్పకూలింది. విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది, నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హౌలాండ్ టౌన్షిప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతి తీవ్రమైన విమాన ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు.

విమాన శిథిలాలను గుర్తించిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానం పూర్తిగా ధ్వంసమై ఉండటంతో లోపల ఉన్న వారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ప్రాథమికంగా ఇంజిన్‌ ఫెయిల్యూర్‌ కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ ఘోర ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మరియు అధికారులు సంతాపం తెలిపారు. ఈ ఘటన అమెరికాలో ప్రైవేట్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

Full View
Tags:    

Similar News