పథకం సూపర్.. కానీ, ఈ ప్రచారమే డేంజర్!
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. `ఎన్టీఆర్ విద్యా వికాసం` పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలకు చేరువ చేయనున్నారు.;
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. `ఎన్టీఆర్ విద్యా వికాసం` పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలకు చేరువ చేయనున్నారు. ఈ పథకం కింద.. కేవలం మహిళలను మాత్రమే అర్హులుగా పేర్కొంటారు. అది కూడా చదువుకునే పిల్లలు ఉన్న మహిళలను మాత్రమే లబ్ధి దారులుగా చేర్చనున్నారు. ఇక, ఈ పథకం.. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. త్వరలోనే దీనిని సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ పథకం కింద.. చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు(తల్లులకు) 4 లక్షల రూపాయల వరకు అత్యంత స్వల్ప వడ్డీకే రుణాలను అందించనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల చదువుల కు.. వారి దైనందిన కార్యకలాపాలకు, హాస్టల్ ఫీజులకు, వాహనాల కోనుగోలుకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల తల్లులకు కూడా అమలు చేయనున్నారు. తీసుకున్న రుణాన్ని 3 ఏళ్లలోపు వాయిదాల రూపంలో చెల్లించాలి.
దీనికిగాను ఏడాదికి100కు 4 రూపాయల చొప్పున వడ్డీ విధిస్తారు. ఈ పథకం కింద అర్హతపొందేందుకు డ్వా క్రా సంఘంలో సభ్యురాలై ఉండాలన్న షరతు విధించారు. ఇదిలావుంటే.. పథకం బాగానే ఉన్నా.. దీనిపై వ్యతిరేక ప్రచారం రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ముందు.. దాదాపు అదే తరహాలో దీనిని తీసుకువస్తున్నారు. అయితే.. తల్లికి వందనంలో ఎంత మంది పిల్లలు ఉన్నా.. రూ.15 వేల చొప్పున ఫ్రీగా ఇస్తారు.
కానీ, ఈ ఎన్టీఆర్ విద్యా వికాసం పథకంలో నిధులను అప్పుగా ఇస్తారు. ఈ తేడానే ప్రభుత్వం లక్ష్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఉచిత పథకం స్థానంలో ఎన్టీఆర్ విద్యా వికాసం పథకాన్ని తీసుకువస్తున్నా రన్న చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది మొదటికే ఇబ్బంది కలిగించినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు. సో.. మొత్తంగా మంచి పథకమే అయినా.. వ్యతిరేక ప్రచారంరాకుండా.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.