రాజ కుటుంబ వారసుడిపై 3 రే*ప్ + 23 కేసులు.. ఎవరీ హోయ్బీ?
నార్వేలో కలకలం రేపుతున్న ఈ ఉదంతంపై రాజభవనం నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదని తెలుస్తోంది.;
అతడొక రాజకుటుంబ వారసుడు, యువరాణి పెద్ద కుమారుడు, వయసు ఇరవై ఎనిమిదేళ్లు. ఇతడిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, గాయపరచడం వంటి పలు అభియోగాలతో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ రకంగా అతనిపై మొత్తం 26 కేసులు నమోదవ్వగా.. అందులో మూడు అత్యాచారం కేసులు కావడం గమనార్హం.
అవును... నార్వే రాజకుటుంబ వారసుడు, యువరాణి మెత్తె మారిట్ పెద్ద కుమారుడైన మారియోస్ బోర్గ్ హోయ్బీ (28)పై అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి పలు అభియోగాలతో 26 కేసులు నమోదు చేసినట్లు ఓస్లో పోలీసులు వెల్లడించారు. బాధితుల సంఖ్య రెండంకెలకు పైగా ఉన్న ఈ కేసుల్లో నెలల తరబడి విచారణ అనంతరం అభియోగాల నమోదుకు నిర్ణయించారు!
ఈ సందర్భంగా స్పందించిన న్యాయవాది పీటర్ సెకులిక్... తన క్లయింట్ ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాడు కానీ.. కానీ చాలా కేసుల్లో.. ముఖ్యంగా లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన కేసులలో ఎటువంటి తప్పు జరిగిందని అంగీకరించడం లేదని అన్నారు. ఇతడిని ఆగస్టు 4, 2024న అరెస్టు చేసినప్పటి నుండి విచారణ జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఓస్లో పోలీస్ డిస్ట్రిక్ట్... పెద్ద సంఖ్యలో సాక్షుల ఇంటర్వ్యూలు, అనేక సోదాలు, విస్తృతమైన డిజిటల్ మెటీరియల్ సమీక్షతో సమగ్ర దర్యాప్తు నిర్వహించామని ఒక ప్రకటనలో తెలిపింది. 2024 - 2025 మధ్య హోయ్బీని అనేకసార్లు ప్రశ్నించినట్లు తెలిపింది. అయితే అతడు పోలీసులకు సహకరించారని వెల్లడించింది.
నార్వేలో కలకలం రేపుతున్న ఈ ఉదంతంపై రాజభవనం నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదని తెలుస్తోంది. అయితే... హోయ్బీ ఇపుడ రాజ కుటుంబం నుంచి విడిగా ఉంటున్నాడని చెబుతున్నారు.