స్టీల్ ప్లాంట్ హబ్ గా ఉత్తరాంధ్ర
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు.;
ఐటీ హబ్ టూరిజం హబ్ ఇండస్ట్రియల్ హబ్ ఇవన్నీ విన్న మాటలే. కానీ ఇపుడు కొత్తగా మరో మాట వినిపిస్తోంది. అదే స్టీల్ ప్లాంట్ హబ్ అని. అది కూడా ఉత్తరాంధ్రాకే ఖ్యాతి దక్కుతోంది. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ అంటే వన్ అండ్ ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే ఉంటూ వచ్చింది. అందుకే విశాఖకు ఉక్కు నగరం అన్న పేరు కూడా ఉంది. అయితే ఇపుడు వరసబెట్టి ఉక్కు పరిశ్రమలు ఉత్తరాంధ్ర కు తరలి వస్తున్నాయి. అదే సమయంలో ఉపాధి అవకాశాలు కూడా హార్డ్ వేర్ ఫీల్డ్ లో పెరగనున్నాయి.
అనకాపల్లి తర్వాత :
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ భారీ ఎత్తున ఏర్పాటు కాబోతున్న సంగతి తెల్సిందే. ఏకంగా 17 మిలియన్ టన్నుల ఉత్పత్తితో లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో అయిదారు వేల ఎకరాలలో ఈ స్టీల్ ప్లాంట్ రూపు దిద్దుకోనుంది రెండు దశలుగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం 2030 లోగా పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలల్లోనే ఉద్యోగాలు సమీప ప్రాంతాల యువతకు దక్కుతాయని అంటున్నారు. ఇపుడు మిట్టల్ ప్లాంట్ తరహాలోనే మరో స్టీల్ ప్లాంట్ విజయనగరంలో వస్తోంది. అయితే ఇది మినీ స్టీల్ ప్లాంట్ గా ఉండబోతోంది.
కూటమి గ్రీన్ సిగ్నల్ :
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. చీపురుపల్లిలోని గుర్ల మండలం కెల్ల అనే ప్రాంతలో ఈ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే దీనికి సంబంధించి ఒప్పందం సమ్మిట్ లో కుదిరింది అని చెబుతున్నారు.
జిల్లాకు వెలుగులే :
విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా భారీ పరిశ్రమలు అయితే రాలేదు అన్న మాట ఉంది. కానీ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అనేక ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కెల్ల గ్రామం సమీపంలో కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు అని తెలుస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ని సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్థాపిస్తుంది అని అంటున్నారు.
ఉపాధి అవకాశాలు :
ఈ స్టీల్ ప్లాంట్ ని దాదాపుగా వేయి ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం తొమంది వేల కోట్ల రూపాయల దాకా వెచ్చిస్తారు అని తెలుస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయితే ఇక్కడ నుంచి ప్రతీ ఏడాది ఏకంగా రెండు మిలియన్ టన్నుల స్టీలును ఉత్పతి చేస్తారని చెబుతున్నారు. ఇక ఈ కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మాణం రెండు దశలలో పూర్తి అవుతుందని తెలుస్తోది. ఇక ఈ ప్లాంట్ పూర్తి అయితే కనుక స్థానికంగా ఉన్న వారికి వేయి మంది దాకా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. పరోక్షంగా ఇంతకు మరింత మందికి ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రాకు మూడు స్టీల్ ప్లాంట్ లు వచ్చినట్లే అంటున్నారు. దాంతో స్టీల్ హబ్ గా ఉత్తరాంధ్రా నిలవబోతోంది.