డీలిమిటేషన్ తో నంబర్ గేమ్ లో సౌత్ ఓటమి !
డీలిమిటేషన్ ఇపుడు దేశంలో అతి పెద్ద చర్చగా మారుతోంది. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలవుతున్నాయి.;
డీలిమిటేషన్ ఇపుడు దేశంలో అతి పెద్ద చర్చగా మారుతోంది. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలవుతున్నాయి. అందులో డీలిమిటేషన్ మీదనే చర్చిస్తారు. జనాభా ప్రాతిపదికన కాదు ఇపుడున్న సీట్లకు అదనంగా మరో యాభై సీట్లు దేశమంతా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అలా చేసినా ఇలా చేసినా అతి పెద్ద నష్టం సౌత్ స్టేట్స్ కే అని అంటున్నారు దాంతో డీలిమిటేషన్ మీద గొంతు పెంచాల్సింది దక్షిణాది రాష్ట్రాలే అని అంటున్నారు.
మరింతగా తేడా :
ఇపుడు దేశంలో 543 లోక్ సభ సీట్లు ఉన్నాయి. అందులో సౌత్ నుంచి చూస్తే 129 సీట్లు మాత్రమే. ఏపీ తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు కేరళ కలుపుకుంటే ఈ సీట్లు అవుతాయి. ఇక వీటిని పక్కన పెడితే మిగిలిన వాటిలో అధిక సీట్లు ఉత్తరాదివి ఉంటాయి. దాంతో తేడా ఏకంగా 400 పైగా వస్తోంది. అయితే ఇపుడు మరో యాభై శాతం అదనంగా సీట్లను పెంచుకోవాలని ప్రతిపాదనకు కనుక ఒప్పుకుంటే ఈ తేడా ఏకంగా 600 పై చిలుకు ఎంపీల తేడా ఉత్తరాదికీ దక్షిణాదికీ మధ్య అవుతుంది. అంటే డీలిమిటేషన్ చేయకముందు కంటే కూడా మరింత అధిక వ్యత్యాసం అన్న మాట.
గొంతు ఎత్తకపోతే :
ఇప్పటి నుంచి గొంతు పెంచకపోతే కనుక కచ్చితంగా డీలిమిటేషన్ అన్నది దక్షిణాదికి ఇబ్బంది పెట్టే అంశం అవుతుందని అంటున్నారు. దేశంలో ఇప్పటికి అనేక సార్లు ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పాటు అయితే దక్షిణాది ఎంపీల పాత్ర అందులో కీలకంగా ఉండేది. నేషనల్ ఫ్రంట్ అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా వాజ్ పేయి నాయకత్వంలో ఎన్డీయే సర్కార్ అయినా ఇక 2024 నుంచి కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం అయినా సౌత్ స్టేట్స్ ఎంపీల మద్దతుతో సాగుతోంది. ఈ విధంగా అధిక సీట్లు ఉత్తరాదికి తక్కువగా దక్షిణాదికి అయితే మాత్రం ఇక భవిష్యత్తులో ఎపుడూ దక్షిణాదికి కేంద్రంలో కీలక పాత్ర ఉండదు, అంతే కాదు సౌత్ ఎంపీల మద్దతు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్న పరిస్థితి ఏర్పడుతుంది. అది రాష్ట్రాల అభివృద్ధికి ప్రయోజనాలకు కూడా తీవ్ర విఘాతం గా మారుతుంది. అంతే కాదు ఉత్తరాది దక్షిణాది విభజన మరింతగా పెరిగిపోయి కొత్త సమస్యలు సరికొత్త నినాదాలకు కూడా అవకాశంగా మారుతుంది అని మేధావులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయాలు పక్కన పెట్టి :
ఇక కేంద్రం ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుకు దక్షిణాది రాష్ట్రాలలో మద్దతు ఇచ్చేది ఎవరు కాదనేది ఎవరు అన్నది చూస్తే కనుక ఆసక్తికరంగా ఉంటుంది. కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ ఎంపీలు అంతా 20 మంది డీలిమిటేషన్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే డీఎంకే తమిళనాడులో వ్యతిరేకిస్తోంది. డీఎంకే కూటమి మొత్తం 39 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉంటారు. కర్ణాటకలో చూస్తే 27 మంది ఎంపీలు కలిగిన ఎన్డీయే బిల్లుకి సపోర్టు ఇస్తుంది. ఒక్క ఎంపీ ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. తెలంగాణాకు వస్తే కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు మజ్లిస్ ఒక్క ఎంపీ వ్యతిరేకిస్తూంటే 8 మంది బీజేపీ ఎంపీలు సపోర్టు చేస్తున్నారు.
ఏపీ సంగతేంటి :
ఇక ఏపీలో ఎన్డీయేకు 21 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే టెక్నికల్ గా ఇది కనిపిస్తున్నా మొత్తం పాతిక మంది ఎంపీలూ బిల్లుకు లోక్ సభలో మద్దతు తెలుపుతారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే బిల్లుకు అనుకూలంగా 60 మంది ఎంపీల మద్దతు ఉంటే వ్యతిరేకంగా 69 ఉండొచ్చు. అంటే అతి స్వల్ప ఆధిక్యం అన్న మాట. కానీ ఈ విధంగా బిల్లు విషయంలో అనాలోచితంగా మద్దతు ఇస్తే కనుక రాష్ట్రాలు రాజకీయాలు దాటి మరీ దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి మొత్తం 129 మంది ఎంపీలూ ఏకత్రాటిపైకి వచ్చి పోరాడితేనే సౌత్ స్టేట్స్ కి ఫ్యూచర్ లో కేంద్రంలో విలువ నంబర్ గేమ్ లో గెలుపు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.