ప‌డిలేచిన కెర‌టాలు... నేర్పుతున్న పాఠాలు ..!

ఏ పార్టీని.. ఏ నాయ‌కుడిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. ముఖ్యంగా ఏక‌ప‌క్ష రాజ‌కీయాల‌కు తావివ్వ‌ని భార‌త్ వంటి ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఇది త‌ర‌చుగా నిరూపితం అవుతూనే ఉంది.;

Update: 2025-06-29 01:30 GMT

ఏ పార్టీని.. ఏ నాయ‌కుడిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. ముఖ్యంగా ఏక‌ప‌క్ష రాజ‌కీయాల‌కు తావివ్వ‌ని భార‌త్ వంటి ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఇది త‌ర‌చుగా నిరూపితం అవుతూనే ఉంది. అంతా అయిపో యింది.. ఇక‌, ఏమీ లేదు.. అనుకున్న ప్ర‌తిసారీ ప‌డిలేచిన కెర‌టం మాదిరిగా పుంజుకున్న పార్టీలు.. పుంజుకున్న నాయ‌కులు అనేక మంది ఉన్నారు. భార‌త దేశంలో అనేక రాష్ట్రాల్లోనే కాదు.. కేంద్రంలోనూ.. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు సాగాయి.

కేంద్రంలో 1975లో ఎమ‌ర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ .. త‌దుప‌రి 1977లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆమె కూడా స్వ‌యంగా ఓడిపోయారు. ఇంత ఇందిర‌మ్మ ప‌ని అయిపోయిందని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లోనే ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, వాజ‌పేయి ప్ర‌భు త్వం 13 స్థానాల‌తో ఓడిపోయిన‌ప్పుడు కూడా ఇదే త‌ర‌హా చ‌ర్చ వ‌చ్చింది. కానీ.. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యం అందుకున్నారు.

ఉమ్మ‌డి ఏపీ విష‌యానికి వ‌స్తే.. 1983లో టీడీపీ విజ‌యం ఒక అద్భుతం సృష్టించింది. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రించింది. ఇక‌, అన్న‌గారు ఎన్టీఆర్‌కు తిరుగులేద‌ని అంద‌రూ లెక్క‌లు వేసుకున్నారు. కానీ, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. విభ‌జ‌నకు ముందు 2012లో వైసీపీ స్థాప‌న‌తో ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. తండ్రి వైఎస్ మ‌ర‌ణంతో సానుభూతి పెంచుకున్న జ‌గ‌న్‌.. ఆ ఉప ఎన్నిక‌లో ఒక్క స్థానం త‌ప్ప‌.. అన్నింటా విజ‌యం దక్కించుకున్నారు. ఈ స‌మ‌యంలోనే టీడీపీ ప‌లు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది.

ఆ త‌ర్వాత‌.. విభ‌జిత‌ ఏపీలో 2014లో జ‌రిగిన ఎన్నికల్లో అధికారం నాదేన‌ని భావించిన జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు 67 స్థానాల‌తో ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు. దీంతో ఇక‌, త‌మ‌దే రాజ్య‌మ‌ని, త‌మ‌కు ఎదురు లేద‌ని భావించిన టీడీపీ 2019 ఎన్నిక‌ల్లో 23 స్థానాల‌కు ప‌రిమితం అయింది. ఇదే ప‌రంప‌ర‌లో 2024లో వైనాట్ 175 అని నిన‌దించిన వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమితమై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయింది. ఇలా.. ప్ర‌జ‌ల తీర్పు.. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇలానే ఉంది. ఎవ‌రికీ ఏదీ శాస్వ‌తం కాదు.

ప్ర‌జ‌ల‌ను మెప్పించే విధానంలోనే ప్ర‌భుత్వాల మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. భూస్థాపితం చేస్తాం.. తొక్కుకుంటూ పోతాం.. నార తీస్తాం.. అని అన‌డానికి.. సినిమా డైలాగులు చెప్ప‌డానికి బాగానే ఉంటుంది. కానీ, ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టే ప‌రిస్థితిని.. ప్ర‌జ‌ల ఊపును అంచ‌నా వేసుకునే ప‌రిస్థితిని కొన‌సాగించ‌క‌పోతే.. ప‌డిలేచిన కెర‌టాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంటాయ‌న్న‌ది వాస్త‌వం!!.

Tags:    

Similar News