అబ్బా.. ఏం దాతృత్వం.. ఆ పెట్రోల్‌పై పన్ను లేదట.. త్వరపడండి బాబూ.. త్వరపడండి!

మనం రోజూ బంకుల్లో పోయించుకునే సాధారణ పెట్రోల్‌పై ఒక్క పైసా కూడా తగ్గలేదు. అది మైండ్ లో పెట్టుకోండి.

Update: 2026-06-11 04:51 GMT

వాహనదారులారా.. జేబులు చిల్లులు పడి.. గుండెలు బరువెక్కిన దేశ ప్రజలారా.. మీకోసమే కేంద్ర ప్రభుత్వం అమృతాన్నే కురిపించింది. రోజురోజుకూ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ విరాట్ కోహ్లీ కంటే వేగంగా దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలను చూసి భయపడిపోతున్నారా? ఇకపై మీ భయాలన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ మనమీద అపారమైన కరుణతో కొన్ని రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్నును పూర్తిగా రద్దు చేసింది! అవును మీరు విన్నది నిజమే... ‘సున్నా’ పన్ను.. కానీ ఆగండి... ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎప్పటిలాగే కండిషన్స్ అప్లై!

లీటరు రూ.100 దాటిన పెట్రోల్‌కు కాదు.. మరి దేనికి?

మనం రోజూ బంకుల్లో పోయించుకునే సాధారణ పెట్రోల్‌పై ఒక్క పైసా కూడా తగ్గలేదు. అది మైండ్ లో పెట్టుకోండి. మరి దేనికి పన్ను తీసేశారంటే... E22, E25, E27, E30 రకాల ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుంది. అంటే పెట్రోల్‌లో ఇథనాల్ మద్యం లాంటి బయో ఇంధనం శాతం భారీగా ఉండే వేరియంట్లన్నమాట. దీనిపై ఎక్సైజ్ సుంకం లేదు.. రోడ్డు సెస్ లేదు, మౌలిక సదుపాయాల డెవలప్‌మెంట్ సెస్ లేదు... అసలు ఏ సెస్సూ లేదు. అంతా ‘నిల్’. దేశంలో పర్యావరణాన్ని కాపాడేయాలి, ముడి చమురు దిగుమతులను తగ్గించేసి విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిల్చేయాలనే తపనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ రేంజ్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ అసలు మన ఊర్లలోని ఏ బంకుల్లో దొరుకుతుంది? ఒకవేళ దొరికినా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మన బండ్లు ఆ ఇంధనాన్ని తట్టుకోగలవా? అనే చిన్న చిన్న లాజిక్కులను మనం అడగకూడదు. ప్రభుత్వం పన్ను తగ్గించింది.. మనం సంతోషించాలి.. అంతే!

రైతులకు పండగే పండగ... బండ్లు తగలేడిపోతే మనకెందుకు?

ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాల నుంచి తయారు చేస్తారు కాబట్టి దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందట. ఇదైతే మంచి విషయమే, రైతన్నలు బాగుండాల్సిందే. కానీ మీ పాత స్కూటరో, కార్లో ఈ హై-ఇథనాల్ పెట్రోల్ పోస్తే.. లోపల ఉన్న ఇంజిన్ భాగాలు, పైపులు కరిగిపోతాయనేది ఆటోమొబైల్ నిపుణుల భయం.

నిజానికి మన దేశంలో ఇప్పుడిప్పుడే E20 (20% ఇథనాల్) బండ్లు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అప్పుడే E30 (30% ఇథనాల్) కి కూడా పన్నులు ఎగ్గొట్టేసి.. "రండి బాబూ రండి.. పన్ను లేని పెట్రోల్ పోసుకోండి" అని పిలుపునిస్తోంది.

పర్యావరణాన్ని రక్షించడానికి, ముడి చమురు భారాన్ని తగ్గించడానికి కేంద్రం వేసిన ఈ అడుగు అద్భుతమే. కాకపోతే.. పన్ను లేని పెట్రోల్ దొరికినా దాన్ని తట్టుకునే ఇంజిన్లు లేకపోవడం.. రోడ్డు మీద బిరియానీ ఫ్రీగా ఇస్తూ చేతులు కట్టేసినట్టు ఉందంటున్నారు జనాలు.

ఏదేమైనా ప్రజలారా.. ఆలస్యం చేయకండి. వెంటనే షోరూమ్‌లకు వెళ్లి "నాకు 30 శాతం ఇథనాల్‌ను తట్టుకునే సరికొత్త బండి ఇవ్వండి, మా కేంద్ర ప్రభుత్వం అక్కడ పన్నులు తగ్గించేసి ఎదురుచూస్తోంది" అని ఆర్డర్ ఇచ్చేయండి. పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు అవ్వండి..

Tags:    

Similar News