తూర్పు తీరంలో గర్జిస్తున్న కాపులు !
కాపులకు రిజర్వేషన్లు అంటూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రీలో తొలిసారి సమావేశం అయింది. కూటమి ప్రభుత్వం మీద రుసరుసలతో పాటు జనసేన మీద విసుర్లూ విసిరింది.
తూర్పు తీరంతోనే ఏపీ రాజకీయాలు ఎపుడూ ముడిపడి ముందుకు సాగుతూ ఉంటాయి. అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజన ఏపీలో అయినా సెంటిమెంట్ అక్కడే ఉంది. అక్కడ నుంచే మెల్లగా మార్పు మొదలవుతుంది. వారి స్వరంలో తేడా వస్తే సర్దుకోవాల్సిందే. అయితే టీడీపీ కూటమి ఏపీలో కొలువు తీరి రెండేళ్ళు మాత్రమే అయింది. ఇంతలో కాపులు గర్జిస్తున్నారు. దాంతో వారి విషయంలో ఏదో ఒకటి చేసి దగ్గరకు తీసుకునే చాన్స్ కచ్చితంగా ఉంది. అయితే మెల్లగా మొదలైన ఈ అసంతృప్తి స్వరం బిగ్గరగా మారకుండా చేసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి పెద్దల మీద ఉంది అని అంటున్నారు.
రిజర్వేషన్లు అంటూ :
కాపులకు రిజర్వేషన్లు అంటూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రీలో తొలిసారి సమావేశం అయింది. కూటమి ప్రభుత్వం మీద రుసరుసలతో పాటు జనసేన మీద విసుర్లూ విసిరింది. రెండేళ్ళ క్రితం తాము గెలిపించిన కూటమి ప్రభుత్వం హామీలను అయితే నెరవేర్చలేదని కూడా సమితి నాయకులు విమర్శించారు. కాపు జాతి కోసం కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తొలి హెచ్చరిక అంటూ ఈ మీటింగ్ సాగింది. ఇది ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగానే చర్చనీయాంశం అయింది.
జగన్ ని ఓడించాం :
తామంతా కలసి 2024 ఎన్నికల్లో కరపత్రాలు కూడా ఇంటింటికీ పంచి మరీ జగన్ ని ఓడించామని సమితి నాయకులు చెప్పారు. జగన్ తాను రిజర్వేషన్లు ఇవ్వలేనని బాహాటంగానే చెప్పారు అని గుర్తు చేశారు. జగన్ ఓటమికి రాష్ట్రవ్యాప్తంగా తాము పని గట్టుకుని మరీ తిరిగామని కాపు నాయకులు చెప్పారు. ఇపుడు కూటమి ప్రభుత్వం తమను తమ జాతిని పట్టించుకోకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పవన్ అన్న మాటలతో :
ఇదిలా ఉంటే ఈ మధ్యన పార్టీ సమావేశంలో పవన్ అది కూడా రాజమండ్రీలోనే క్లారిటీగా మాట్లాడారు. తనను ఒక కులం ఉచ్చులో పడవేయవద్దని తాను అందరి వాడిని అని చెప్పారు. దాని మీదనే కాపులు కొంత రగులుతున్నారు అని అంటున్నారు. తమ కులం కోసం చేసుకోవడంలో తప్పేమిటి అన్నది కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల మాటగా ఉంది. కాపులకు అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించాలని అలాగే వారికి తగిన న్యాయం చేయాలని ఎన్నికల ముందు కూటమి పెద్దలు ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాలని వారు గట్టిగా కోరుతున్నారు
వ్యూహాత్మకంగానేగానేనా :
ఇదిలా ఉంటే ఈ సమావేశం జరపడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. మొదట సమావేశాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ఒక మార్గంగా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇదే తీరున నిర్వహిస్తారని అంటున్నారు. ఆ మీదట మెల్లగా జనంలోకి వెళ్ళి సభలు నిర్వహించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే కాపులకు ఏ విధనమైన న్యాయం జరగాలి అన్న దాని మీద అయితే ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్లు అయితే కుదిరే వ్యవహారం కాదు, మరి ఈబీసీలకు ఇచ్చే పది శాతం రిజర్వేషనల్లో అయిదు శాతం కాపులకు ఇచ్చే విధంగా పోరాటం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. అంతే కాదు నామినేటెడ్ పదవులతో పాటు రాజకీయంగా మరింత ప్రయారిటీని కోరుకుంటున్నారని అంటున్నారు. అలాగే సంక్షేమ పధకాలు ప్రతెయేకించి కాపులకు కొనసాగించాలని కూడా డిమాండ్ గా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా కాపులలో మెల్లగా మొదలైన ఈ అసంతృప్తి స్వరం ఏ వైపునకు దారి తీస్తుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.