తెలంగాణ సెక్రటేరియట్ తో అమరావతి సచివాలయాన్ని పోల్చొద్దు.. ఎందుకో చెప్పిన నారాయణ
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.;
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. కొందరు తెలంగాణలోని కొన్ని అంశాలను ఉదాహరణగా చూపిస్తూ.. అమరావతిలోని నిర్మాణాల్ని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ తో అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని పోలుస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సెక్రటేరియట్ తో అమరావతిలో నిర్మిస్తునన సచివాలయాన్ని పోల్చద్దన్న ఆయన.. రెండింటికి సంబంధమే లేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లుగా చెప్పటమే కాదు.. రెండింటి మధ్య ఉన్న తేడాను వివరించారు. వైసీసీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అమరావతిలో కట్టే సచివాలయాన్ని హైదరాబాద్ సచివాలయంతో పోల్చటం సరికాదన్న నారాయణ.. రెండింటి మధ్య తేడాను వివరించారు
‘‘హైదరాబాద్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు.. కార్యదర్శులు.. సిబ్బంది కోసం కట్టారు. పలు శాఖల హెచ్ వోడీలు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. అమరావతిలో కట్టే సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శకులతో పాటు విభాగాధిపతి కార్యాలయాలు.. కార్పొరేషన్లు ఉంటాయి. అన్నీ ఒకేచోటకు తీసుకొస్తే ప్రజలకు పాలన తేలిగ్గా ఉంటుందని నిర్మిస్తున్నాం. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. సగం తెలుసుకొని మాట్లాడి ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పిన నారాయణ.. డ్రైనేజీ.. తాగునీటి పైపులైన్లు.. విద్యుత్తు.. టెలిఫోన్ కేబుళ్లు అన్నీ భూగర్భంలో వేస్తున్న విషయాన్ని చెప్పిన మంత్రి నారాయణ.. వైసీపీకి ఒక పంచ్ లాంటి మాటను విసిరారు. కూటమి సర్కారుకు ఏపీ రాజధాని అమరావతి అన్న క్లారిటీ ఉందని.. వైసీపీ రాజధాని ఎక్కడ? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిగా జగన్ అంగీకరించారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారన్న నారాయన?.. ‘‘అమరావతిని ఆపటం ఇక సాధ్యం కాదని తెలిసే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అంటూ మండిపడ్డారు. మొత్తంగా ఏపీ రాజధాని ఎంత భారీ.. అధునాతనంగా ఉంటుందన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టం చేశారని చెప్పక తప్పదు.