నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా.... బీజేపీ సరికొత్త ప్లాన్ ?
బీహార్ లో సీఎం ఎవరు అంటే జనరల్ నాలెడ్జి విషయంలో ఏ కాస్తా డౌట్ ఉన్న వారైనా ఈ ప్రశ్న మాత్రం కరెక్ట్ గా చెప్పేస్తారు.;
బీహార్ లో సీఎం ఎవరు అంటే జనరల్ నాలెడ్జి విషయంలో ఏ కాస్తా డౌట్ ఉన్న వారైనా ఈ ప్రశ్న మాత్రం కరెక్ట్ గా చెప్పేస్తారు. ఏ మాత్రం తడుముకోకుండా నితీష్ సీఎం అంటారు. అవును ఆ విధంగా రెండు దశాబ్దాలు రెండు మూడు తరాలు బీహార్ సీఎం కుర్చీని అట్లే పెట్టుకుని పాలించిన ఘనత నితీష్ కుమార్ దే అనడంలో సందేహం లేదు. నితీష్ కుమార్ 2005 నుంచి 2025 దాకా అంటే గత ఇరవై ఏళ్ళుగా సీఎంగా ఉన్నారు. ఇక బీహార్ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ జేడీయూ ఇతర మిత్ర పక్షాలు అన్నీ కలసి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోడీ ఈ నెల 25 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ఇంకా డిసైడ్ కాలేదా అన్న చర్చ బయల్దేరింది.
సీఎం కానీ అభ్యర్థి కాదు :
ప్రస్తుతం నితీష్ బీహార్ సీఎం. కానీ ఆయన మాత్రం సీఎం అభ్యర్ధి కారు, ఈ రకమైన కన్ఫ్యూజన్ తో బీహార్ లో ఎన్డీయే ప్రచారం సాగుతోంది. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ అంటోంది కానీ ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అని గట్టిగా చెప్పలేకపోతోంది. బీహార్ లో ఒక వైపు విపక్షం మహా ఘట్ బంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ స్పష్టంగా కనిపిస్తున్నారు. అయితే అదే పరిస్థితి మాత్రం ఎన్డీయేలో కనిపించడం లేదు అని అంటున్నారు. దాంతో విపక్షం నుంచి ఎన్ డీయే మీద విమర్శలు వస్తున్నాయి.
అమిత్ షా వ్యాఖ్యలు :
మరో వైపు చూస్తే తాజాగా ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నితీష్ తమ ఎన్డీయే కూటమికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అని మాత్రమే చెప్పారు. కాబోయే సీఎం ఎవరు అసలు ఎన్డీయే కూటమి తరఫున సీఎం అభ్యర్ధి ఎవరు అన్న దానికి మాత్రం అమిత్ షా ఆచీ తూచీ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల అనంతరం కూటమి పార్టీలు సమావేశం అయి సీఎం అభ్యర్ధిని ఎన్నుకుంటాయని అమిత్ షా చెప్పారు. దాంతో నితీష్ సీఎం అభ్యర్ధి అని అమిత్ షా సూటిగా స్పష్టంగా చెప్పలేదని మహా ఘట్ బంధన్ నుంచి అపుడే కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయిపోయింది. నితీష్ ఇక తమ కూటమికి ఎప్పటికీ ముఖ్యమంత్రి కారు అని సాక్ష్తాత్తూ అమిత్ షాయే స్పష్టం చేశారు అని కాంగ్రెస్ ఎక్స్ ఖాతా ద్వారా ఏకి పారేస్తోంది. నితీష్ కి ఇది వెన్నుపోటు అని అంటోంది. అయితే బీజేపీ కూడా వెంటనే రంగంలోకి దిగి అమిత్ షా మొత్తం ఇంటర్వ్యూ సారం చూడాలని అంటోంది. అమిత్ షా మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని కూడా మండిపడుతోంది.
అలసిపోయిన నితీష్ :
ఇక మరో విపక్ష పార్టీ జన సూరజ్ నుంచి ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ అయితే నితీష్ ఇక ఎప్పటికీ బీహార్ సీఎం కాలేరని తేల్చేశారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయేకు పాతిక అసెంబ్లీ సీట్లు కూడా రావని అన్నారు. నితీష్ శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయారు అని కూడా పీకే అంటున్నారు. నితీష్ నాయకత్వంలోని జేడీయూకి ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ పూర్తిగా తగ్గిపోతోంది అని అన్నారు. ఒక విధంగా ఆయనకు ఈ ఎన్నికలే చివరివి అని కూడా చెప్పేశారు.
అమిత్ షా వ్యాఖ్యల మీద మిత్రులు :
విపక్షాల సంగతి పక్కన పెడితే ఎన్డీయే మిత్రులు మాత్రం తలో విధంగా స్పందించారు. బీజేపీ జేడీయూ తరువాత మరో పెద్ద పార్టీ అయిన ఎల్జేపీ నుంచి కేంద్ర మంత్రి ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ అయితే అమిత్ షా మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన శాసనసభా పక్షం సీఎం అభ్యర్ధిని ఎన్నుకుంటుందని సంప్రదాయం మాత్రమే చెప్పారని అంటున్నారు. అయితే మరో మిత్ర పార్టీ హిందుస్తాన్ అవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం కూటమి సీఎం అభ్యర్ధిని ఎన్నికలకు ముందే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రీయ లోక్‌మంచ్ జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా మాత్రం నితీష్ కుమార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కచ్చితంగా ఉంటారని ధీమాగా చెప్పారు.
బీజేపీ ప్లాన్ :
ఇలా ఎవరికి తోచిన తీరున వారు మాట్లాడుతున్నా కూడా బీజేపీ ప్లాన్ ఈసారి వేరే విధంగా ఉందని అంటున్నారు. ఈసారి ఎన్డీయే కూటమి గెలిస్తే తప్పనిసరిగా బీజేపీ అభ్యర్ధిని సీఎం గా సీట్లో కూర్చోబెట్టాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అమిత్ షా ఆచీ తూచీ మాట్లాడిన తీరే దానికి నిదర్శనం అంటున్నారు. మొత్తానికి నంబర్ గేం మీద కూడా ఈసారి బీహార్ సీఎం అభ్యర్థి ఎవరో ఎన్డీయే నిర్ణయించవచ్చు అని అంటున్నారు.