ఎన్నికల్లో పాల్గొనకుండా రెండు దశాబ్దాలుగా సీఎం.. ఈయన రూటే సపరేటు..

ఇంత సుదీర్ఘ కాలంలో ఆయన ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బదులుగా, ఆయన ఎమ్మెల్సీ (శాసన మండలి సభ్యుడిగా) ఎన్నికై పదవిని చేపట్టారు.;

Update: 2025-10-02 07:30 GMT

ముఖ్యమంత్రి అంతే ఒక రాష్ట్రానికి రిప్రజెంటేటివ్. ఆ స్టేట్ కు ఆయనే బాస్. సీఎంను ఎలా ఎన్నుకుంటారన్నది మనకు తెలిసిందే కదా.. అసెంబ్లీకి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత శాసన సభ్యులు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కానీ ఒక సీఎం 20 సంవత్సరాలుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ సక్సెస్ సీఎంగా చరిత్రలో నిలిచారు.

నితీశ్ కుమార్ ది సుదీర్ఘ ప్రయాణం..

బిహార్ రాజకీయాల్లో ఈ ముఖ్యమంత్రి ప్రయాణం సుదీర్ఘం, ఒక అధ్యాయం. 2005 నుంచి రెండు దశాబ్దాలుగా (2014-15 మధ్య కొద్ది నెలలు మినహా) ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘ కాలంలో ఆయన ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బదులుగా, ఆయన ఎమ్మెల్సీ (శాసన మండలి సభ్యుడిగా) ఎన్నికై పదవిని చేపట్టారు. ఆయనే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఆయన పాలన అంటే అక్కడి వారికి మక్కువ అందుకే ప్రతి సారి ఆయననే సీఎంగా ఎన్నుకుంటున్నారు. అయితే, విధానంపై ప్రతిపక్షాలు తరచుగా విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయకపోవచ్చని చర్చించుకుంటున్నారు.

ఆదిలోనే ఎదురుదెబ్బ..

నితీష్ కుమార్ రాజకీయ జీవితం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమం ద్వారా విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైంది. పట్నా ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసుకున్న తర్వాత, ఆయన కొంతకాలం విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన తొలి ప్రయత్నం ఫలించలేదు. 1977లో జనతా పార్టీ తరఫున హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నితీష్ ఓటమి పాలయ్యారు. 1980లో అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసినా ఓటమే ఎదురైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేక..

చివరికి, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌దళ్ టికెట్‌పై పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయలేదు. సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ, 1985 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగలేదు. ఈ అంశం ఆయన వ్యూహంలో భాగమా..? లేదంటే భయమా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

రాజకీయాల్లో విజయపరంపర..

అసెంబ్లీ రాజకీయాల నుంచి దూరంగా ఉన్న నితీష్ కుమార్ లోక్‌సభ (పార్లమెంట్) ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బార్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. ఈ విజయం ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆయన వరుసగా లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు సాధించారు. 1991, 1996, 1998, 1999 సార్వత్రిక ఎన్నికల్లో అదే బార్ స్థానం నుంచి నితీష్ వరుసగా విజయం సాధించారు.

లోక్ సభకు..

2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలు బార్, నలంద నుంచి పోటీ చేశారు. ఎప్పుడూ గెలిచే బార్‌లో ఓటమి చెందగా, నలందలో విజయం దక్కింది. 2004 తర్వాత నితీష్ కుమార్ ఏ ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు, శాసనమండలి (ఎమ్మెల్సీ) ద్వారానే తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో 9 ప్రత్యక్ష ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ కలిపి) పోటీ చేశారు. ఇందులో 6 సార్లు విజయం సాధించగా, మూడు సార్లు ఓటమిని చవిచూశారు.

అసెంబ్లీ ఎన్నికలు

ఆయన మూడుసార్లు నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఒకసారి మాత్రమే (1985లో) విజయం సాధించారు. తొలి రెండు ప్రయత్నాలు (1977, 1980) ఘోరంగా విఫలమయ్యాయి.

భయపడుతున్నారా..?

ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు పనిచేసిన నితీష్ కుమార్ శాసనమండలి మార్గాన్ని ఎంచుకోవడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనమని కొందరు రాజకీయ నాయకులు విశ్లేషిస్తుంటే, ప్రజా తీర్పును ఎదుర్కోడానికి ఇష్టపడకపోవడం అని మరికొందరు చెప్తున్నారు. బిహార్‌ రాజకీయ భవిష్యత్తులో ఈ అంశం కీలక చర్చనీయాంశంగా ఉంది.

Tags:    

Similar News