వ‌య‌సులో పార్టీ కంటే చిన్నోడు..బీజేపీ కొత్త సార‌థి ప్ర‌త్యేకతలివే!

బీజేపీ.. వ‌రుస‌గా ప‌దిహేనేళ్లు (2029 వ‌ర‌కు చూస్తే) కేంద్రంలో ఉన్న పార్టీ... 15 పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. 45 ఏళ్ల చ‌రిత్ర ఉన్న పార్టీ.. అలాంటి పార్టీకి కేవ‌లం 45 ఏళ్ల యువ‌కుడు జాతీయ అధ్య‌క్షుడు కాబోతున్నారు.;

Update: 2025-12-15 17:17 GMT

బీజేపీ.. వ‌రుస‌గా ప‌దిహేనేళ్లు (2029 వ‌ర‌కు చూస్తే) కేంద్రంలో ఉన్న పార్టీ... 15 పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. 45 ఏళ్ల చ‌రిత్ర ఉన్న పార్టీ.. అలాంటి పార్టీకి కేవ‌లం 45 ఏళ్ల యువ‌కుడు జాతీయ అధ్య‌క్షుడు కాబోతున్నారు. ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా, పార్టీకి క‌ట్టుబ‌డిన కుటుంబ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని న‌డిపించే నాయ‌కుడు కూడా కాబోతున్నాడు. స‌రిగ్గా పార్టీ కంటే నెల‌న్న‌ర రోజుల చిన్న‌వాడ‌యిన బిహారీ యువ మంత్రి నితిన్ న‌బీన్.. బీజేపీకి అతి చిన్న వ‌య‌సు అధ్య‌క్షుడు కానున్నారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావం కాగా.. తొలి ఆరేళ్లు అగ్ర‌నేత వాజ్ పేయీనే అధ్య‌క్షుడిగా ఉన్నారు. త‌ర్వాత దిగ్గ‌జ అద్వానీ సార‌థ్యం వ‌హించారు. అనంత‌రం ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ నుంచి ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వ‌ర‌కు అంద‌రూ బీజేపీ కంటే ముందు పుట్టిన‌వారే. కానీ, కాబోయు చీఫ్ నితిన్ న‌బీన్ మాత్రం 1980 మే 23న పుట్టారు. ఈయ‌న తండ్రి న‌బీన్ సిన్హా. 2006 వ‌ర‌కు బిహార్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న అనూహ్య మ‌ర‌ణంతో నితిన్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అప్ప‌టికి ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 25 ఏళ్లు మాత్ర‌మే కావ‌డం విశేషం. ఇక నాటినుంచి న‌బీన్ ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోలేదు. బంకీపూర్ నుంచి ఐదుసార్లు గెలిచిన ఆయ‌న నీతిశ్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు. ఇలా న‌డ్డా త‌ర్వాత ఈ ప‌ద‌విలో నియ‌మితులైన రెండో వ్య‌క్తి నితిన్ కావ‌డం గ‌మ‌నార్హం.

బిహార్ బ‌రి.. బెంగాల్ పై గురి

కాయ‌స్థ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నితిన్‌.. ప‌శ్చిమ బెంగాల్ స‌రిహ‌ద్దులోని బిహార్ ప్రాంతానికి చెందిన‌వారు. వ‌చ్చే ఏడాది బెంగాల్ లో ఎన్నిక‌లు ఉన్నందున ఆయ‌న‌ను పార్టీ చీఫ్ గా నియ‌మించార‌ని చెబుతున్నారు. సంక్రాంతి (జ‌న‌వ‌రి 14) అనంత‌రం నితిన్ అధ్య‌క్షుడు కానున్నారు. బిహార్ నుంచి బీజేపీ చీఫ్ కాబోతున్న మొద‌టి నాయ‌కుడు ఈయ‌నే. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో నితిన్‌.. సినీ స్టార్, మాజీ ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా కుమారుడు ల‌వ్ సిన్హాను 84 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

విజ‌య‌సార‌థి..

రెండేళ్ల కిందట పొరుగునున్న ఛ‌త్తీస్గ‌ఢ్ బీజేపీ ఇంచార్జిగా వ్య‌వ‌హరించిన నితిన్.. అక్క‌డ పార్టీ గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలోనే బిహార్ ఎన్నిక‌ల ఘ‌న విజ‌యానికి గుర్తింపుగా, యువ త‌రానికి ప్రోత్సాహంగానూ నితిన్ ను బీజేపీ అధ్య‌క్ష స్థానంలో కూర్చోబెడుతున్నారని చెబుతున్నారు. ఈయ‌న సార‌థ్యంలోనే పార్టీ బెంగాల్‌, యూపీ వంటి పెద్ద రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది.

Tags:    

Similar News