సంపద కొందరిదే...గడ్కరీ హాట్ కామెంట్స్ !
ఇక నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ హాట్ కామెంట్స్ చేశారు. సంపద పెరుగుతోంది అన్నది ఎంత వాస్తవమో అది కొందరి వద్దనే ఉంటోంది అన్నది అంతే వాస్తవం అన్నారు.;
ఈ దేశంలో పేదరికం లేదని గత పదకొండేళ్ల కాలంలో అది గణనీయంగా తగ్గిందని ఒక వైపు ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి గణాంకాలను నివేదికలను ముందు పెడతారు. ఏకంగా కోట్ల మంది దాకా పేదలు పేదరికం నుంచి బయటకు వచ్చారని కూడా ఈ మధ్యనే చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ మాత్రం కుండ బద్దలు కొట్టారు.
ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన వారు అన్నది తెలిసిందే. పైగా ఆయన నాగపూర్ వాసి. అందుకేనేమో తన సొంత ప్రాంతానికి వచ్చినపుడు ఆయన ఇంకా ధాటీగా మాట్లాడుతారు అని అంటారు. ఇక నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ హాట్ కామెంట్స్ చేశారు. సంపద పెరుగుతోంది అన్నది ఎంత వాస్తవమో అది కొందరి వద్దనే ఉంటోంది అన్నది అంతే వాస్తవం అన్నారు.
సంపద సృష్టి జరుగుతోందని కానీ అది సమతూల్యంగా అందరికీ పంచే విషయంలోనే సరైన పాలసీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ప్రస్తావన కూడా ఆయన తెచ్చారు. ఆ ఇద్దరూ ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడం వల్ల సంపద పెరిగిందని అయితే సంపద ఒకే చోట కేంద్రీకృతం అవుతూంటే ఆపే చర్యలను వారు తీసుకోలేకపోయారు అని అన్నారు.
అంతే కాదు సంపద ఆ దిశగా ఆలోచనలు పాలసీలు కూడా దశాబ్దాలుగా లేకపోవడం విచారించదగిన విషయం అన్నారు. ఈ రోజున చూస్తే దేశంలో జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 22 నుంచి 24 శాతంగా ఉంటే సేవా రంగం వాటా 52 నుంచి 54 శాతంగా ఉందని అదే సమయంలో వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతంగా ఉందని గడ్కరీ గణాంకాలను వినిపించారు. గ్రామీణ ప్రాంతంలో అరవై నుంచి డెబ్భై శాతం మంది ఆధారపడి అందులో భాగస్వాములు అయ్యే వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతం ఉంటే ఆర్థిక అసమానతలు ఉండి తీరుతయాని అన్నారు.
అందుకే ఈ వ్యత్యాసాలను అధిగమించి అందరికీ సంపదలో సమాన వాటా లభించేలా విధానాలు పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు. నిజానికి గడ్కరీ అన్న మాటలను చూస్తే కనుక భారత దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వారికి అతి తక్కువ మొత్తాలే లభిస్తున్నాయి. అదే కొందరికి మాత్రం కుబేరుల మాదిరిగా సంపద అంటా చేరుతోంది.
మరి ఇలా కుప్పలా సంపద పోగు అయి ఒకే చోట తక్కువ మందికే దక్కుతూంటే దేశంలో పేదలు అంతకంతకు పెరిగిపోయి ఒకే దేశంలో రెండు దేశాలు ఏర్పాటు అవుతాయన్న ఆందోళన మేధావులు చాలా కాలం క్రితమే వ్యక్తం చేశారు. పేదల భారత ధనికుల భారంతా ఎన్నడూ పూడ్చలేని అగాధం ఏర్పాటు కాకముందే ఆర్ధిక నిపుణుల నుంచి సలహాలతో పాలకులు సరైన పాలసీలు రూపొందించాల్సి ఉందని అంటున్నారు. అత్యధికంగా సంపాదించే ధనికులు కుబేరుల వద్ద ఒకటికి రెండు మార్లు పన్నులు వేసి అయినా సంపదను పేదలకు చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు.